టీడీపీ అధినేత చంద్రబాబు… కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల దాడుల్లో.. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వారితో పాటు… గాయపడిన వారిని పరామర్శించేందుకు చంద్రబాబు.. ఈ రోజు ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. వైసీపీ శ్రేణుల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని అందించనున్నారు. మరోవైపు కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భరోసాను ఈ యాత్ర ద్వారా చంద్రబాబు కల్పించే ప్రయత్నం చేస్తారు.
భరోసా యాత్రలో చినగంజాం మండలం రుద్రమాంబపురం గ్రామాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. ఇటీవల వైసీపీ నేతల దాడి కారణంగా మృతి చెందిన టీడీపీ కార్యకర్త పద్మ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఎనిమిదో తేదీన అనంతపురం జిల్లాకు వెళ్తారు. హత్యకు గురైన వారి కుటుంబాలనే కాకుండా.. దాడులకు గురైన వారిని కూడా.. చంద్రబాబు పరామర్శిస్తారు. చంద్రబాబు భరోసా కార్యకర్తలకే కాదు.. పార్టీకి కూడా లభిస్తోంది. చంద్రబాబు.. నెలలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవడంతో.. పార్టీ నేతలు ధైర్యం తెచ్చుకుంటున్నారు. పక్క పార్టీల వైపు చూడటం మానేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీతో.. ఇప్పటికే కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు.. మాత్రం.. తర్వాత చూద్దామని.. చెబుతున్నారట. రక్షణ కోసం బీజేపీకి వెళ్తే రాజకీయ భవిష్యత్ అంథకారం అయిపోతుందని వారు నిర్ణయించుకుని… సంబంధాలు కొనసాగిస్తాం కానీ పార్టీలోకి రాలేమని చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కుప్పం పర్యటన.. ఆ తర్వాత జిల్లాల పర్యటనలు ఉండటం.. ప్రభుత్వ పనితీరు నెల రోజుల్లోనే తేలిపోయిందనే భావన ఉండటంతో.. బీజేపీ వైపు టీడీపీ నేతలు చూడటం తగ్గించారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామనుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. టీడీపీ కార్యకర్తల హత్యల దగ్గరుంచి.. హామీల అమలు వరకూ.. అన్నింటినీ గురిపెట్టి.. వైసీపీపై పోరాటం చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. టీడీపీ నేతలు.. మళ్లీ పరాజయం మూడ్ మర్చిపోయి.. రాజకీయంలోకి వచ్చేస్తున్నారు.