లోక్‌సభ సమావేశాల్లో .. తెలంగాణకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ మాట్లాడే అవకాశం పొందుతున్న తెలంగాణ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను కాకుండా.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతలు కూడా.. అదే పని చేస్తూండటంతో.. టీఆర్ఎస్ పార్టీ నేతలు మండి పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలను.. లోక్‌సభలో ప్రస్తావించడం ఏమిటని మండి పడుతున్నారు. ఈ విషయంపై.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు.. లోక్‌సభ స్పీకర్ బిర్లాను కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రసంగాలను … రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞాపనపత్రం కూడా అందించారు.
లోక్‌సభలో రేవంత్ రెడ్డి పోడు భూముల సమస్యను ప్రస్తావించారు. తెలంగాణలో ఆదివాసీలు, అటవీ శాఖ అధికారుల మధ్య జరుగుతున్న పోరుపై కేంద్ర హోం శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం సమీక్షించాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం పొందిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఆదివాసీలను అడవుల నుంచి బయటికి పంపించడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్ ఓడిపోయిందని, దీంతో ఆ పార్టీ నేతలు అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ప్రసంగించారు.
అదే సమయంలో… మాట్లాడే అవకాశం పొందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. 27మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించడం వల్ల ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిదాలు చోటుచేసుకొన్నాయన్నారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ.. ప్రసంగించారు. వీరు ప్రసంగిస్తున్నప్పుడే… నినాదాలు చేసిన… టీఆర్ఎస్ నేతలు… తర్వాత.. స్పీకర్‌ను కలిసి వాటిని రికార్డుల్లో నుంచి తీసేయాలని కోరారు. అయితే.. స్పీకర్ తీసేసే అవకాశం లేదు. మొత్తానికి తెలంగాణ రాజకీయం.. లోక్‌సభలోనూ ప్రతిధ్వనిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.