కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పట్ల రాజకీయ పక్షాలన్నీ పెదవి విరిచాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టడంతోపాటు ఆర్థిక లోటు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటికీ రాబోయే బడ్జెట్ లో నిధులు సమకూర్చాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలను కూడా తీసుకెళ్లి వినతి పత్రం కూడా సమర్పించారు. లోక్ సభలో మిధున్ రెడ్డి ఏపీని కేంద్రం ఆదుకోకపోతే ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బడ్జెట్లో ఏదీ కనిపించలేదు.
పన్నుల వాటాలో రాష్ట్ర హక్కుగా రావాల్సిన 34 వేల 8౩౩ కోట్ల రూపాయలు వస్తాయి. కానీ గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల వివరాలను ఎక్కడా పేర్కొనలేదు. బడ్జెట్లో రాష్ట్రం గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం, పోలవరం, రాజధాని వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉండాల్సిందని వైసీపీ నేతలు అంటున్నారు. విభజన చట్టాన్ని లోక్ సభ ఆమోదించిందని, అటువంటప్పుడు ఆ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే వైసీపీ చేయగలిగేమీ లేదు. గత బడ్జెట్ సమయంలో… బీజేపీ కన్నా.. టీడీపీపైనే వైసీపీ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మాత్రం.. చర్చించుకుంటామని చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ కనీసం స్పందన కూడా వ్యక్తం చేయలేదు.
టీడీపీకి ఉన్న ముగ్గురు సభ్యులు ఎప్పట్లానే నిరసన తెలిపారు. కానీ వారి వాయిస్ లెక్కలోకి రావడంలేదు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ అన్యాయం జరిగిందని ట్విట్టర్ వేదిక గా విజయవాడ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు, ఇతర అంశాలపై కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన వైసీపీ సైలెంట్ గా ఉండిపోతోంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా.. ఏపీకి కనీసం విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులను కూడా రాబట్టలేకపోయారు. అప్పట్లో చేసిన విమర్శలు.. ఇప్పుడు తమకు అన్వయించాల్సి వస్తున్నా..నోరు తెరవలేకపోతున్నారు.