కేంద్ర బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దక్షిణాది నుంచి 30 శాతం పన్నులు రూపంలో ఆదాయం వస్తోందన్నారు. కానీ, దక్షిణాది నుంచి వసూలు చేసిన పన్నుల్ని ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ నుంచి విద్యుత్… ఇదే పార్లమెంటులో పొందుపరచిన అంశాల అమలుపై మరోసారి అన్యాయం జరిగిందన్నారు. ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టినా అర్ధ రూపాయి విదిల్చింది లేదనీ, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు.
ఆర్థికమంత్రి కొన్ని పదాలను తమిళంలో మాట్లాడినంత మాత్రాన దక్షిణాది ప్రజలను సంతోష పెట్టలేరన్నారు. మీరు ఏ భాషలో మాట్లాడినా మాకు ఇచ్చిన నిధులెన్నో లెక్క చెప్పాలని కాంగ్రెస్ గట్టిగా అడగదల్చుకుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్ష ఇలానే కొనసాగుతూపోతే ఇది తీవ్ర అసహనంగా మారి, ఉద్యమాలకు కారణం అవుతుందని కేంద్రం గుర్తించాలన్నారు. నిరుద్యోగ సమస్యపై ఎక్కడా బడ్జెట్ లో ప్రస్థావన లేదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల్ని అమాంతంగా పెంచేశారన్నారు. గడచిన ఐదేళ్లలో ఫలానా చోట పెట్టుబడులు పెట్టామనిగానీ, తద్వారా ఆదాయం పెంచామనిగానీ ఎక్కడా చెప్పుకోలేకపోతున్నారన్నారు. గడచిన ఐదు బడ్జెట్లలో వచ్చిన ఫలితాలను పార్లమెంటులో ఎందుకు ప్రస్థావించలేదన్నారు రేవంత్.
దక్షిణాదిపై వివక్ష అనే అంశాన్ని మరోసారి తెరపైకి రేవంత్ తెచ్చారనే చెప్పాలి. నిజానికి, ఈ బడ్జెట్ లో ఆంధ్రాకి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదనే విశ్లేషణలే వస్తున్నాయి. తెలంగాణకు కూడా అంతే! మరి, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. పూర్తిగా విశ్లేషించాకనే మాట్లాడతామని ఏపీ అధికార పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో అధికార పార్టీ ఈ బడ్జెట్ పై స్పందించాల్సి ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసికట్టుగా ఒకేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. వాస్తవం మాట్లాడుకుంటే… భాజపా సర్కారుపై వైకాపా విమర్శలకు దిగడం అనుమానమే. కానీ, తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో భాజపా పావులు కదుపుతోంది. కాబట్టి, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ సర్కారు ఘాటుగా స్పందించే అవకాశం ఉందనే అనిపిస్తోంది. ఏదేమైనా, దక్షిణాది రాష్ట్రాల మీద భాజపా వివక్ష ధోరణి మరోసారి కచ్చితంగా స్పష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.