ప్రత్యేకహోదా వస్తే.. ఇన్ కంట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదని.. జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రచారం చేశారు. అది నిజమేనని… మోదీ… నిరూపించారు. గుజరాత్ గిఫ్ట్ సిటీకి.. జగన్ చెప్పిన హోదా ఇచ్చేశారు. ఆ సిటీలో పెట్టుబడులు పెట్టేవాళ్లు పదేళ్ల వరకు టాక్స్‌లు కట్టాల్సిన పని లేదు. ఢిల్లీని మించిన రాజధాని ఏపీకి నిర్మిస్తామంటే.. మురిసిపోయిన జనానికి కేంద్రం.. ఐదేళ్లుగా షాకులు మీద షాకులు ఇచ్చి.. రియాల్టీలోకి తెచ్చింది. కొత్తగా ఆరో ఏడాది.. ఏదో ఇస్తారని.. ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. వారి ఆశల్ని… కేంద్రం వమ్ము చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు.. మరో రూ. వెయ్యి కోట్లు ఇస్తామని.. పార్లమెంట్‌లోనే ఆర్థిక మంత్రి చెప్పిన మాటలను.. ఈ ఆర్థిక మంత్రి గుర్తుపెట్టుకోలేదు.
గుజరాత్ ” గిఫ్ట్ సిటీ ” కి పదేళ్లు టాక్స్ హాలీడే..!
గుజరాత్లో ” గిఫ్ట్ సిటీ” పేరుతో ఓ నగరం నిర్మిస్తున్నారు. నిజానికి ఆ నగరం… నిర్మించాల్సిన ఆవశ్యకత లేదు. కానీ పారిశ్రామికంగా..ఓ అద్భుత డెస్టినేషన్ సృష్టించాలన్న ఉద్దేశంతో.. నిర్మిస్తున్నారు. ఈ గిఫ్ట్ సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి.. పన్ను మినహాయింపు ఇస్తున్నారు. దీన్ని మరో పదేళ్ల పాటు పెంచారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీ మోదీ మానసపుత్రిక. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోజీ దీన్ని తలపెట్టారు. అప్పట్లో ముందుకు సాగలేదు. ప్రధాని అయిన తర్వాత పరుగులు పెట్టిస్తున్నారు. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా లక్ష కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సిటీ నిర్మాణం జరుగుతోంది. ఇందులో సెజ్‌తో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఎడ్యుకేషన్ జోన్, టౌన్‌షిప్‌లు, ఇంటర్నేషనల్ టెక్నో పార్క్, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, స్టాక్ ఎక్చ్సేంజ్తో పాటు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా శాఖ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 29 అంతస్తులు ఉన్న రెండు టవర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటితో పాటు మరిన్ని టవర్లు, నివాస కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థల సహకారంతో ఈ సిటీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి.. పదేళ్లు టాక్స్ హాలీడే ప్రకటించారు. ఇది పూర్తిగా.. వ్యాపారం కోసం ఉద్దేశించిన సిటీ.
రాజధాని లేని రాష్ట్రంపై కనికరం కూడా లేదు..!
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీపై ప్రధాని చూపెడుతున్న శ్రద్ధలో ఒక్కటంటే ఒక్క శాతం కూడా ఏపీపై పెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు దిల్లీలాంటి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని ప్రధాని మోదీ స్వయంగా హామీనిచ్చారు. రాజధాని పేరు చెప్పి కేంద్రం ఇంతవరకు రాష్ట్రానికి రూ.2,500 కోట్లు ఇచ్చింది. దీనిలో కూడా రూ.వెయ్యి కోట్లు గుంటూరులో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, విజయవాడలో వరదనీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు ఇచ్చారు. ఆ వెయ్యి కోట్లు కూడా రాజధానికి ఇచ్చినట్టే కేంద్రం చెబుతోంది. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. రాజధాని పరిపాలన నగరంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చవుతుందని.. డీపీఆర్ పంపారు. కానీ ప్రభుత్వ భవనాలకూ పైసా ఇవ్వలేదు.
అమరావతికి రావాల్సివన్నీ “గిఫ్ట్ సిటీ”కి..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపారు. యూనివర్శిటీలు, మెడికల్ కాలేజీలు.. సాఫ్ట్ వేర్ సంస్థలు.. ఇలా చాలా పెద్ద ఎత్తున… పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. కానీ.. చంద్రబాబు ఓటమితో.. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. వారంతా.. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ దారి చూసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. పన్నుల్లో మినహాయింపు వస్తుంది. కానీ ఏపీకి హోదా ఇవ్వడం లేదు. గిఫ్ట్ సిటీకి మాత్రం.. ఆ హోదా పరోక్షంగా ఇవ్వడంతో.. పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోవడం ఖాయం.