తెలుగు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడమే గొప్పన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏపీకి రూ. 30 వేల కోట్లు.. తెలంగాణకు రూ. 20వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని.. టీవీ చర్చల్లో… జబ్బలు చరిచేసుకుంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల నుంచి రూ. లక్ష కోట్ల పన్నులు కేంద్రం వసూలు చేసి.. తిరిగి ఇస్తోంది మాత్రం రూ. యాభై వేల కోట్లే. ఈ విషయం ఆ బీజేపీ నేతలకు తెలుసు. అయినా ఆ యాభై వేల కోట్లు అయినా ఇస్తున్నారు.. మోడీ తల్చుకుంటే.. అదీ కూడా ఇవ్వరు .. జాగ్రత్త అన్నట్లుగా హెచ్చరికలు పంపుతున్నారు.
తెలంగాణకు విదిలింపులు..!
విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఐఐటీ హైదరాబాద్ రూ. 80 కోట్లు , ఏపీ,తెలంగాణ గిరిజన విశ్వ విద్యాలయాలకు రూ. 8కోట్లు , అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రిసెర్చ్ హైదరాబాద్‌కు రూ. 313.39 కోట్లు , సలార్‌జంగ్ మ్యూజియానికి రూ.27 కోట్లు , ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్‌కు రూ.28 కోట్లు , ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ హైదరాబాద్‌కు రూ. 53.93 కోట్లు ,నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, హైదరాబాద్‌కు రూ. 80.75 కోట్లు కేటాయింపులు జరిగాయి. కేంద్ర సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సింగరేణిలో పెట్టుబడులకు రూ.1850 కోట్లు, విదేశీ రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకు సాయం కింద హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్టు-2కు రూ.200 కోట్లు , హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు రూ.120 కోట్లు కేటాయించారు.
ఏపీకి అదిలింపులు..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు అంశాలకు పద్దులో ఎక్కడా చోటుదక్కలేదు. మంజూరు చేసి నిర్మాణంలో.. ఉన్న కేంద్ర విద్యాసంస్థలకు… చిల్లర ఖర్చులకు నిధులు మంజూరు చేశారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీకు రూ.13 కోట్లు , ఐఐపీఈకు రూ.31.82 కోట్లు , ఏపీ,తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలు- రూ.8 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు రూ.1400 కోట్లు , హిందుస్థాన్ షిప్ యార్డ్‌కు రూ. 5 కోట్లు , డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.20 కోట్లును కేంద్రం కేటాయించింది. ఇక విదేశీ రుణాలతో చేపట్టే ప్రాజెక్టుకు సాయం కింద విశాఖపట్టణం- చెన్నై పారిశ్రామిక కారిడర్ అభివృద్ధి కార్యక్రమం ప్రాజెక్టుకు -1కు రూ.250 కోట్లు , విశాఖపట్టణం- చెన్నై పారిశ్రామిక కారిడర్ అభివృద్ధి కార్యక్రమానికి 425.61 కోట్లు , ఏపీలో 24గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టు రూ.181.52 కోట్లు, ఏపీ 24గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు మరో రూ.250 కోట్లు, ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు – రూ.350 కోట్లు ఏపీ గ్రామీణ సుస్థిర వృద్ధి ప్రాజెక్టు రూ.150 కోట్లు నిధుల కేటాయింపులు జరిగాయి. ఇక ఐఐఎం నిట్, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ సంస్థలకు బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు.
అన్యాయం జరగలేదని జవదేకర్ సర్టిఫికెట్..!
బడ్జెట్ ముగిసిన తర్వాత … ఏపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే జవదేకర్ రంగంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదని.. శాఖల పరంగా కావాల్సిన సమయంలో నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అంటే తమకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని మాటలు చెప్పారు. ఈ మాటలు ఐదేళ్ల నుంచి చెప్పారు. ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. బడ్జెట్లో కేటాయించడానికే మనసొప్పని కేంద్రం.. విడిగా నిధులిస్తుందని.. ఎవరూ నమ్మలేరు. ఎందుకంటే.. గత ఐదేళ్లుగా అన్ని మాటలు చెప్పినా.. ఇవ్వలేదు మరి..!