కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మొండిచేయి చూపించింది మోడీ సర్కారు. వైకాపా అధికారంలోకి రాగానే ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి వచ్చారు. ఢిల్లీ వచ్చిన ప్రతీసారీ హోదా గురించి వినతులు ఇస్తూనే ఉంటామన్నారు. ఆ తరువాత, నీతీ ఆయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఇదే తరహాలో మాట్లాడారు. కేంద్రానికీ, ఆంధ్రాలో వైకాపా సర్కారుకీ మంచి అనుబంధమే ఉంది కాబట్టి… ఈసారి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఏమీ లేదు! ప్రత్యేక హోదా మీద కేంద్రం స్పందించదు అనేది ముందే తేలిపోయింది. కానీ, అమరావతి నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్లు ఇస్తామని కేంద్రం గతంలో చెప్పినా.. ఈ బడ్జెట్ లో ఆ ఊసు లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ ప్రస్థావనే లేదు. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని చెబుతూ వచ్చారే తప్ప… ఈ బడ్జెట్ లో దానికీ నిధుల కేటాయింపుల్లేవ్. విజయవాడ మెట్రో, విశాఖలోని పెట్రో కెమికల్ కాంప్లెక్స్, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్ట్… ఇలా దేనికీ నిధుల కేటాయింపు లేదు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది కొంత ఆసక్తికరంగా ఉంది. బడ్జెట్లో ఆంధ్రాని ఆదుకునేందుకు ప్రత్యేకమైన కేటాయింపులు అంటూ ఏవీ లేవనేవి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి, నిధులను రాబట్టుకునేందుకు జగన్ సర్కారు అనుసరించబోతున్న వ్యూహంలో ఏవైనా మార్పులు ఉండాలి. కానీ, గతంలో చెప్పినట్టుగానే… కేంద్రానికి వినతులు ఇచ్చే ఉద్దేశంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. సీఎం త్వరలోనే మరోసారి ఢిల్లీ వెళ్తారనీ, ప్రధానమంత్రితో సహా మంత్రులందరితోనూ సమావేశమౌతారనీ, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ వినతలు ఇస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ కేంద్రానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉంటామన్నారు బుగ్గన. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచబోతున్నామన్నారు.
వినతులతో కేంద్రం స్పందిస్తుందా అనేది ప్రశ్న..? గత ఐదేళ్లలో ఆంధ్రా మీద ఎలాంటి సవతి తల్లి ప్రేమను కేంద్రం ప్రదర్శించిందో… ఇప్పుడూ అదే ధోరణిలో ఉందని అర్థమౌతోంది. గత టీడీపీ సర్కారు మాదిరిగా భాజపా మీద వైకాపా ఎదురుతిరిగే పరిస్థితి లేదన్నది కేంద్రానికి అర్థమైన విషయమే. మన ఎంపీలతో మోడీకి అవసరం లేదు కాబట్టి, మనం సామరస్యంగానే వ్యవహరించాలనే ధోరణికి సీఎం జగన్ కూడా వచ్చేశారు! కాబట్టి, బుగ్గన చెబుతున్నట్టు వినతులు ఇచ్చినంత మాత్రాన ఒత్తిడి ఎలా పెరుగుతుంది..? విభజన చట్టంలో ఉన్న హక్కుల సాధన కోసం ఇతర మార్గాలను వైకాపా అన్వేషించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి.