అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తనను కుంగదీయలేదని.. మరింత బలోపేతం చేసిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.. తానా మహాసభలకు … తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్.. ప్రవాస భారతీయులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసి… ఎదుర్కొన్న వైఫల్యంపై.. సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ ఓటమి తననేమీ బాధపెట్టలేదని.. పావుగంటలో.. ఓటమి ప్రభావం నుంచి బయటపడ్డానని.. ప్రవాసభారతీయులకు తెలిపారు.
రాజకీయంలో విలువలు కాపాడటమే గెలుపు..!
జనసేన అధినేత రాజకీయాల్లో గెలుపంటే.. ఓట్ల పోటీలో.. మెజార్టీ ఓట్లు తెచ్చుకోవడం అనే భావనలో లేరు. రాజకీయాల్లో గెలుపంటే… విలువలను కాపాడటమేనని నమ్ముతున్నారు. అదే విషయాన్ని తానా వేదికపై నుంచి.. తడుముకోకుండా ప్రకటించారు. విలువల రాజకీయాలు చేశానని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నగదు పంపిణీ చేపట్టినా… జనసేన అభ్యర్థులు మాత్రం.. ఆ పని చేయలేదు. కొంత మంది జనసేన అభ్యర్థులు.. నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుని కూడా.. పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఆగిపోయారు. ఆదే విషయాన్ని పవన్ కల్యాణ్ పరోక్షంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఓడిపోయినంత మాత్రాన.. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” విలువలను నిలబెట్టినంత కాలం గర్వంగా తలెత్తుకొని నిలబడతా.. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులే ఇబ్బంది పడనప్పుడు.. ఓ సత్యాన్ని మాట్లాడే నాకెందుకు ఇబ్బందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విలువల కోసం నేను మాట్లాడుతూనే ఉంటా.. ఎవరికి కష్టం వచ్చినా బలంగా మాట్లాడుతా.. నాకు ఓట్లు పడొచ్చు.. పడకపోవచ్చు.. ప్రభుత్వాలు రాకపోవచ్చు.. నేను కూడా సంపూర్ణంగా ఓడిపోవచ్చు .. అయినా కూడా వెనక్కి తగ్గబోనని.. ధీమా వ్యక్తం చేశారు.
ఓటమిని తట్టుకునే శక్తి.. గెలుపు కోసం ఎదురు చూసే ఓపిక..!
పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఇక రాజకీయంగా కోలుకోలేరన్న అభిప్రాయం సహజంగా.. రాజకీయవర్గాల్లో ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. చేతల్లోనే ఆ అభిప్రాయాన్ని తానా వేదికగా.. తుడిచేసే ప్రయత్నం చేశారు. తన జీవితంలో.. ఎదుర్కొన్న ఓటములు.. గెలుపు చేసిన కృషిని క్లుప్తంగా వివరించి.. భవిష్యత్‌పై.. తానెంత నమ్మకంగా ఉన్నానో… మాటలతోనే… వివరించారు. నెల్సన్ మండేలానే తనకు స్ఫూర్తి అని.. ఆయన పడినన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదన్నారు. న్నప్పటి నుంచి నా ప్రతీ ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసిందని పవన్ గర్తు చేసుకున్నారు. సక్సెస్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూడగలననన్నారు. సినిమాల విషయంలో చెప్పాలంటే.. నాకు ఖుషి తర్వాత సక్సెస్ లేదని… అయితే ఎక్కడా నిరాశ పడకుండా.. ప్రయత్నాలు చేయడం వల్లే గబ్బర్‌సింగ్ సక్సెస్ వచ్చిందన్నారు. దానికి చాలా సమయం పట్టిందని గుర్తు చేశారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి.. ప్రతీసారి భయపడుతుంటే ముందుకు వెళ్లలేమని.. తనకు ఆ ధైర్యం ఉందని పవన్ కల్యాణ్ తానా సభల్లో స్ఫూర్తి దాయకంగా చెప్పుకొచ్చారు.
ప్రతి అపజయం.. విజయానికి దారి..!
పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో ఓటమిని ఎంత స్పోర్టివ్‌గా తీసుకున్నారో.. అంత చాలెంజింగ్‌గా తీసుకున్నారని.. ఆయన మాటలతో స్పష్టమయింది. ప్రతి అపజయం.. విజయానికి దారేనని.. ప్రసంగం ప్రారంభంలోనే గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీపై కులముద్ర వేసే ప్రయత్నాలను.. కూడా.. ఆయన పరోక్షంగా వ్యతిరేకించారు. తనకు అలాంటి భావనలే లేవని.. ప్రసంగం ద్వారా సందేశం పంపారు. అందరూ అలాగే ఉండాలని కోరుకున్నారు. నా కులం కాదు.. నా ప్రాంతం కాదు.. అంటూ మనం కొట్టుకుంటూ పోతే రేపు మనల్ని రక్షించేవారుండరని గుర్తు చేశారు. ఏ పార్టీ అయినా సరే అది కుల సంఘంగా విడిపోకూడదనే కోరికన్నారు. ఏం చేయగలను అనే రాజకీయాల్లోకి వచ్చాను… కానీ, నేను ఏదో తీసుకెళ్దామని రాజకీయాల్లోకి రాలేదని పవన్ కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు.
తానా సభల ప్రసంగంలో పవన్ కల్యాణ్ ఫినిషింగ్ టచ్ కూడా.. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా ఇచ్చారు. ” మన దేశం నాయకులను ప్రేమిస్తుంది.. కానీ, నాయకుడిని చూసి జనం భయపడుతున్నారంటే.. నేతలకు పతనం తప్పదు.. భయపెట్టి పాలిస్తామంటే కుదరదు ఇది భారతదేశం” అని చెప్పి.. భవిష్యత్ రాజకీయ సంకేతాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు.