ఇప్పుడు అందరి దృష్టీ `నాన్ బాహుబలి` రికార్డుల మీదే. `బాహుబలి`ని దాటలేమని అందరికీ తెలుసు. అందుకే రెండో స్థానం కోసం పోటీ ఎక్కువైంది. స్టార్లంతా `మాది నాన్ బాహుబలి రికార్డు` అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు కూడా. కానీ.. చిరు దృష్టి ఏకంగా `బాహుబలి` రికార్డులపైనే ఉంది. దాన్ని ఎలాగైనా అధిగమించాలన్న ఆలోచనతో మొదలెట్టిన సినిమానే `సైరా`. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హిందీ నుంచి అమితాబ్‌ని, కన్నడ నుంచి సుదీప్నీ, తమిళ నాట నుంచి విజయ్సేతుపతినీ తీసుకొచ్చారు. నయన, అనుష్క, తమన్నా లాంటి నాయికలతో ఈ సినిమాకి మరింతగా స్టార్ కళ వచ్చింది. హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేయాలని, అక్కడి బాక్సాఫీసునీ కొల్లగొట్టాలని చిరు ప్లాన్.
కానీ… ఇవన్నీ ఆలోచనలకే పరిమితమయ్యాయి. ఆచరణలో మాత్రం బాహుబలి దరిదాపుల్లోకి కూడా సైరా వెళ్లడం లేదు. బాహుబలి మార్కెటింగ్ స్ట్రాటజీని సైరా టీమ్ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. బాహుబలి సెట్స్‌పైకి వెళ్లిన దగ్గరి నుంచి విడుదల అయ్యేంత వరకూ ఏదో రూపంలో వార్తల్లో ఉండేలా చూసుకుంది రాజమౌళి టీమ్. అలాంటి ప్రయత్నాలేం.. `సైరా` విషయంలో కనిపించలేదు. టీజర్ అయితే వచ్చింది గానీ, అందులో చిరంజీవి లుక్ ఏమిటన్నది ఇంకా బయటపెట్టలేకపోయింది. నయనతార, అమితాబ్, సుదీప్, తమన్నా, విజయ్‌సేతుపతి.. ఇలా చాలామందిస్టార్లున్నారు. వాళ్ల లుక్స్ ఒకొక్కటీ విడుదల చేస్తున్నా బాగుండేది. కానీ.. ఆ దిశగా కూడా ఆలోచించలేదు. మేకింగ్ వీడియోల మాట సరేసరి. ఇవన్నీ మార్కెటింగ్ నైపుణ్యాలు. ఏదో రూపంలో జనాలు సినిమా గురించి మాట్లాడుకునేలా చేయాలి. అప్పుడే.. బాలీవుడ్‌కి సైతం సినిమా రీచ్ అవుతుంది. 250 కోట్లని తిరిగి రాబట్టుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు. బాహుబలి రికార్డులపై కన్నేసి నప్పుడు బాహుబలి కంటే మించిన ప్రమోషన్లు చేసుకోవాలి. ఆ విషయంలో చిత్రబృందం ఘోరంగా విఫలం అవుతోంది. అయితే ఇప్పటికీ మించి పోయినది ఏమీ లేదు. అక్టోబరు 2న సినిమా విడుదల చేస్తున్నారు. విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈలోగా… సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కావల్సినంత ప్రమోషన్లు కల్పించుకోవొచ్చు. ఈవిషయంలో నిర్మాతగా రామ్‌చరణ్ తన దూకుడు పెంచాల్సిందే.