రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. నాలుగైదు నెలల కిందటి వరకు లోపాయికారీ మిత్రులుగా కనిపించిన టీఆర్ఎస్, బీజేపీ లు ఇప్పుడు ఒకరి మీద ఒకరు వ్యూహాలు రచించుకుంటూ బిజీగా ఉన్నారు. అదే కోవలో నెల రోజుల కిందటి వరకు ఇదే తరహా మిత్రులు గా కనిపించిన బీజేపీ, వైఎస్సార్సీపీ ల మధ్య నెమ్మదిగా ఒకరి పట్ల మరొకరి వైఖరి మారుతున్నట్లుగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ, ప్రతిపక్ష నేత జగన్ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించేవారు. ఎన్నికల సమయానికి, ఎన్నికైన కొద్దిరోజుల పాటు కూడా బీజేపీ వైఎస్సార్ సిపి నేతల మధ్య సానుకూల వ్యాఖ్యలు వినిపించాయి. అయితే గట్టిగా ఒక నెల గడిచిందో లేదో, కన్నా లక్ష్మీనారాయణ రూటు మార్చినట్లు గా కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో నిర్మించిన ప్రజావేదిక లో జగన్ కూల్చినప్పుడు దానికి వ్యతిరేకంగా గళం విప్పిన కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.
మారిన కన్నా లక్ష్మీనారాయణ వైఖరి వైఎస్ఆర్సిపి అభిమానుల లో ఆందోళన కలిగిస్తోంది. అయితే వారి ఆందోళనకు కారణం బీజేపీకి రాష్ట్రస్థాయిలో బలం ఉందనో, లేదంటే బలపడుతున్నారనో కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో కనీస స్థాయిలో బలపడాలన్నా చాలా సమయమే పట్టేటట్లు ఉంది. మరి వైఎస్ఆర్సిపి అభిమానుల ఆందోళనకు కారణం ఏంటంటే, ఇది కన్నా లక్ష్మీనారాయణ సొంత వైఖరి అయితే పరవాలేదు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఇదే వైఖరితో ఉంటే ప్రమాదమే అన్న భావన వారి ఆందోళనకు కారణం. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమె మీద ఉన్న పాత కేసు లో ఇచ్చిన తీర్పు కారణంగా ఆవిడ ఒక నెల రోజులపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. నెలరోజుల ఆ జైలు జీవితం జయలలితను ఆరోగ్యపరంగా దెబ్బతీయడమే కాకుండా ఆమె మొండి వైఖరి లో కూడా మార్పు తీసుకొని వచ్చింది. ఈ నేపథ్యమే, బీజేపీ వైఖరి మారితే, దాని వల్ల వైఎస్ఆర్సీపీకి ప్రమాదం అని వైఎస్ఆర్సిపి అభిమానులలో ఆందోళన కలగడానికి కారణం అవుతోంది.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్థాయి కేసులు ఉన్న ఏ నాయకుడి పిలక అయినా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే అన్న అభిప్రాయం బలంగా ఉన్న నేపథ్యంలో, వైఎస్ఆర్సిపి అభిమానుల ఆందోళన కూడా సమంజసమైనది గానే కనిపిస్తోంది.