ముఖ్యమంత్రిగా అమెరికా వెళ్లిన కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చే పరిస్థితులు కర్ణాటకలో ఏర్పడుతున్నాయి. ఆపరేషన్ కమల్‌ను.. బీజేపీ ఫుల్ స్వింగ్‌లో అమలు చేస్తూండటంతో.. ఇప్పటికే ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టి.. తాము అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీకి.. ఇప్పుడు పరిస్థితులు కలసి వస్తున్నాయి. వారం రోజుల క్రితం.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా… తాజాగా.. మరో ఎనిమిది మంది కాంగ్రెస్, మరో ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా బాటపట్టారు. వీరందరి రాజీనామాలు ఆమోదం పొందితే.. కాంగ్రెస్ – జేడీఎస్ సర్కార్.. సభలో మెజార్టీ కోల్పోతుంది.
మొదట కాంగ్రెస్‌కి చెందిన ఆనంద్ సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, తాజాగా రమేశ్ జర్కీహోళీ తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించారు. అప్పుడే.. కర్ణాటకలో సంక్షోభం ఖాయమని తేలిపోయింది. ఈ రోజు 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలు సమర్పించారు. రాజీనామా చేసినవాళ్లలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. అమెరికా వెళ్లే ముందే.. కుమారస్వామి మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇద్దరు ఇండిపెండెంట్లకు మంత్రులుగా చాన్సిచ్చారు. ఆమెరికా వెళ్లిన తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది. అసలు ఎమ్మెల్యేల రాజీనామా కథను ఎవరు నడిపిస్తున్నారో.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వ్యూహకర్తగా పేరున్న శివకుమార్ ఉన్నారని.. కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది.అయితే.. ఆపరేషన్ ముఖ్యకారకుడు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన విశ్వనాథ్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకలో గతంలో బీజేపీ ఒక్కసారి అధికారం చేపట్టింది. అది కూడా.. ఆపరేషన్ కమల్ సాయంతోనే. పూర్తి మెజార్టీ లేకపోవడంతో… కొంత మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి.. మెజార్టీ నిరూపించుకుని… వారిని తమ పార్టీ తరపున గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అలా వారి ప్రభుత్వం మొదటి సారి అధికారంలో నిలబడింది. రెండో సారి కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సీట్లు 224 ఉన్నాయి. కాంగ్రెస్-78, జేడీఎస్-37, బీఎస్పీ-1, ఇతరులు-2 ఉన్నారు. బీజేపీకి సంఖ్యాబలం- 105. కాంగ్రెస్ , జేడీఎస్‌లకు చెందిన 13 మంది రాజీనామా చేయడంతో.. అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే.. 105 మంది సభ్యులు కావాలి. ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత ఆ సంఖ్య కాంగ్రెస్, జేడీఎస్‌లకు కలిపి 102 మాత్రమే అవుతుంది. ఇతరులు ఇద్దరు, బీఎస్పీ ఎమ్మెల్యే్.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వైపు మళ్లడం ఖాయం కాబట్టి… ప్రభుత్వ పతనాన్ని అడ్డుకోవడం కష్టమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.