ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు.. అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో.. ఆయనకు చేదోడువాదోడుగా ఉండి.. ఆ తర్వాత ఎన్టీఆర్ నే పదవి నుంచి దించేసి.. కాంగ్రెస్ సాయంతో.. సీఎంగా ప్రమాణం చేసి… ఆ తర్వాత ప్రజాగ్రహంతో… నెలలోపే పదవిని కోల్పోయిన చరిత్ర… నాదెండ్ల భాస్కర్ రావు సొంతం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా… రాజకీయంగా మాత్రం… ప్రముఖ వ్యక్తిగానే చెలామణి అయ్యారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్..రాజకీయ ప్రవేశం తర్వాత.. ఆయన వారసుడు రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. రెండు సార్లు తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్.. స్పీకర్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం జనసేన నేతగా ఉన్నారు. దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేని.. నాదెండ్ల భాస్కర్ రావు.. హఠాత్తుగా బీజేపీలో చేరడం.. రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచేదే.
ఆయన నుంచి బీజేపీ ఏం అశిస్తోందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఆయన వార్థక్యం కూడా.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సహకరించదు. అయితే.. ఓ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలనుకుంటున్న బీజేపీ..నాదెండ్లను.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే.. మరో నాదెండ్ల మనోహర్ ను కూడా బీజేపీలో చేర్చుకోవాలనుకుంటున్నారని.. అందుకే.. ముందస్తుగా… నాదెండ్ల భాస్కర్ రావు ను … చేర్చుకున్నారని చెబుతున్నారు. నాదెండ్ల మనోహర్ ఇప్పటికీ.. తండ్రి చెప్పినట్లే రాజకీయం చేస్తారని… ఆ కుటుంబం రాజకీయాల గురించి తెలిసిన వాళ్లందరూ చెబుతారు.
అయితే.. ఎన్నికలకు ముందు జనసేనలో కీలకంగా వ్యవహరించి..దాదాపుగా.. పార్టీ బాధ్యతలు మొత్తం తీసుకున్న నాదెండ్ల మనోహర్.. ఓడిపోయిన వెంటనే.. పార్టీని వదిలి పెడితే .. ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందన్న భయంతో.. ఆగారని చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే.. కొన్నాళ్లకు అయినా..తండ్రి బాటలో.. నాదెండ్ల మనోహర్ బీజేపీలో చేరుతారని అంటున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన.. అమిత్ షా.. ఏపీ నేతల్ని కూడా.. చేర్చుకోవడం ఆసక్తికరంగా మారింది.