రెండు రోజుల కిందట మైహోమ్ రామేశ్వరరావు మీద జరిగిన ఐటీ దాడులు రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. దాదాపు తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా జరిగిన ఆ సోదాల లో కీలకమైన పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఐటీ దాడులపై ఎట్టకేలకు మై హోమ్ గ్రూప్ స్పందించింది. వివరాల్లోకి వెళితే…
మై హోమ్ గ్రూప్ సంస్థ అధినేత రామేశ్వర రావు టీవీ9 లో వాటా కొన్నప్పటి నుండి తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు గా మారిపోయారు. అయితే టీవీ9 యాజమాన్యం చేతులు మారే క్రమంలో ఆ ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాష్ కి, కొత్త యాజమాన్యానికి మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కాయి. రవి ప్రకాష్ ను పోలీసులు విచారించడం, రేపో మాపో అరెస్ట్ చేస్తారని వార్తలు రావడం కూడా జరిగింది. అయితే హఠాత్తుగా రామేశ్వరరావు మీద జరిగిన ఐటీ దాడులు కొత్త విశ్లేషణలకు దారితీసాయి. రామేశ్వర రావు కు చెందిన కొంత కీలక సమాచారాన్ని రవిప్రకాష్ అధికారులకు అందించాడని, ఆ సమాచారం ఆధారంగానే ఈ ఐటీ దాడులు జరిగాయని విశ్లేషణలు వచ్చాయి. సరిగ్గా అమిత్ షా తెలంగాణకు రావడానికి రెండు రోజుల ముందే ఈ దాడులు జరగడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇప్పుడు అధికారికంగా మై హోమ్ గ్రూప్ ఈ కథనాలపై తమ సొంత ఛానల్ అయిన టీవీ9 ద్వారా స్పందించింది.
మై హోమ్ గ్రూప్ స్పందిస్తూ,ఈనెల 4వ తేదీన మై హోమ్ గ్రూప్ మీద ఐటీ దాడులు జరిగాయని కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి అని, కానీ అవి జరిగింది మై హోమ్ గ్రూప్ మీద కాదని, బెంగుళూరులో ఉన్న మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ మీద దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిగాయని, అయితే ఆ కంపెనీ హైదరాబాదులో మై హోమ్ గ్రూప్ తో వ్యాపార బంధాలు కలిగి ఉండడంతో ఆ కంపెనీ కి సంబంధించిన సమాచారం కోసం ఐటి అధికారులు తమను కేవలం వివరణ కోరారని, వారు అడిగిన అన్ని వివరాలు తాము వారికి ఇచ్చామని మై హోమ్ గ్రూప్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక మై హోమ్ గ్రూప్ ఎప్పుడు చట్టానికి లోబడి చాలా పారదర్శకంగా వ్యాపారాలు చేస్తుందని కూడా అదే ప్రకటనలో తమకు తాము కితాబిచ్చుకుంది.
అయితే ఈ ప్రకటనలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది కాలమే తేల్చాలి.