అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బీజేపీ కార్యకర్తలకు కావాల్సినంత భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అవినీతిపై కోర్టుల్లో కేసులు వేయాలని పార్టీ నేతలకు సూచించారు. నేరుగా.. కేంద్రం విచారణకు ఆదేశిస్తే రాజకీయ వివాదం అవుతుంది. అదే కోర్టులు ఆదేశిస్తే.. విమర్శించడానికి అవకాశం ఉండదు. కానీ విచారణ మాత్రం.. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు.. అదీ కూడా హోంమంత్రి చేతుల్లోనే ఉంటాయి. దాంతో బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. బీజేపీ యుద్ధానికి సిద్ధమయిందని.. గోల్కొండపై.. కాషాయ జెండా ఎగరేసే వరకూ విశ్రమించేది లేదని ప్రకటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ లేదు బీజేపీనే ప్రత్యామ్నాయన్న అమిత్ షా..!
చాపకింద నీరులా… తెలంగాణలో ఇప్పటికే బలపడే ప్రయత్నాలు బీజేపీ జోరుగా చేస్తోంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే.. ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైన బీజేపీ.. మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎగబాకడం అంటే… సామాన్యమైన విషయం కాదు. అసాధ్యమైన విషయం. దాన్ని.. అమిత్ షా చేసి చూపించారు. ఆ గెలుపు కేంద్రంగానే… భారతీయ జనతా పార్టీని.. తెలంగాణలో తిరుగులేని శక్తిగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర నేతలను.. ఢిల్లీకి పదే పదే పిలిపించి… దిశానిర్దేశం చేస్తున్నారు. అగ్రనాయకులు ఇస్తున్న నమ్మకంతో…తెలంగాణ బీజేపీ నేతలు… గోల్కొండపై.. తమ జెండా ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదని ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలోనూ అదే కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
ఇంటా బయటా టీఆర్ఎస్కు “పొగ” స్టార్ట్..!
నిజానికి నాలుగు పార్లమెంట్ సీట్లు .. జాతీయవాద భావోద్వేగంలో..సాధించినవేనని ఆ పార్టీ నేతలకు.. బాగా తెలుసు. అందుకే.. ఆ సీట్లను పునాదిగా వాడుకుని బలపడాలనుకుంటున్నారు. దీనికి కేంద్ర నాయకత్వం.. పకడ్బందీ వ్యూహాలతో ముందుకొస్తోంది. మండల స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలను చేర్చుకోవడం ద్వారా.. బలపడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్.. వరుసగా సాధిస్తున్న విజయాలు… కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని .. అత్యంత సమర్థంగా వాడుకుంటూ… అమిత్ షా … పార్టీని ప్రణాళికాబద్దంగా బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు.. టీఆర్ఎస్కు తమ సెగ ఎలా ఉంటుందో చూపించడం ప్రారంభించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు… బీజేపీ, టీఆర్ఎస్ వేర్వేరు కాదన్న భావన ప్రజల్లో ఉంది. అయితే.. ఇప్పుడు.. అది మారిపోయింది. కేంద్ర స్థాయి నుంచే ఆ మార్పు కనిపిస్తోంది. గతంలో ఏ కేంద్రమంత్రి వచ్చినా.. తెలంగాణ సర్కార్ ను పొగిడి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఎవరొచ్చినా విమర్శించి వెళ్తున్నారు. ఆ మేరకు.. కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి కూడా. దీంతోనే సరి పెట్టడం లేదు… తెలంగాణ సర్కార్ పై.. ఢిల్లీలో కూడా పోరాడుతున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు.. పార్లమెంట్లో మాట్లాడితే… టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే మాట్లాడుతున్నారు. కొద్ది రోజులుగా పార్లమెంట్ లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్… ఇంటర్ రిజల్ట్స్, విద్యార్థుల ఆత్మహత్యలు, పోడు భూముల గురించి.. లోక్సభలో ప్రస్తావించారు.
బెంగాల్ తరహాలోనే తెలంగాణలో గేమ్ స్టార్ట్..!
గవర్నర్ ద్వారా ఇప్పటికే … కొన్ని చికాకు పర్చే చర్యలను.. కేంద్రం ప్రారంభించింది. ముప్పేటదాడితో బీజేపీ.. టీఆర్ఎస్ ను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఏ విధంగా చూసినా.. భారతీయ జనతా పార్టీకి.. తెలంగాణలో ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. అందుకే అమిత్ షా.. గురి పెట్టారు. బూత్ లెవల్లో… అమిత్ షా ప్లానింగ్ వర్కవుట్ చేసేదాకా ఆయన వదిలి పెట్టరు. అందుకే.. బీజేపీ.. ..తెలంగాణలో ఆట మొదలు పెట్టిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.