కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది. విభజన హామీలను కేంద్రం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. పరిశ్రమలు, అదనపు కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం… ఇలా దేనికీ ప్రత్యేక కేటాయింపుల ఊసే లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తారనీ, అదనపు కేటాయింపుల కోసం ప్రధానమంత్రితో సహా ఇతర శాఖల మంత్రులకు వినతులు ఇస్తామని వైకాపా మంత్రులు చెప్పారు. అంటే… బడ్జెట్లో ఆంధ్రాపై కేంద్రం చిన్న చూపు చూసినా, వినతులతోనే సామరస్యంగా నిధుల కోసం డిమాండ్ చేద్దామనే మూడ్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. ఘర్షణ ధోరణి, నిరసన స్వరం వైకాపా నుంచి పెద్దగా లేదు! కానీ, వైకాపా లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి మాత్రం… పోరాటం అనే పదాన్ని తొలిసారిగా ప్రస్థావించారు.
ఆదివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదాను సాధిస్తామన్నారు! రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక హోదా ప్రస్థావనే లేదనీ, ఇది బాధాకరమైన విషయమన్నారు. విభజన హామీలపై కూడా కేంద్రం స్పందన అరకొరగా ఉందనీ, వాటిని అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ పోతామన్నారు మిథున్ రెడ్డి.
నిజానికి, బడ్జెట్లో ప్రత్యేక హోదా ప్రస్థావన ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే, అది అసాధ్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు, నిర్మలా సీతారామన్ కూడా ముందుగానే తేల్చేశారు. ఏపీ భాజపా నేతలు కూడా ప్రత్యేక హోదా సాధ్యం కాదనే చెబుతున్నారు. కాబట్టి, కేంద్రంపై ఏ తరహాలో వైకాపా ఎంపీలు ఒత్తిడి తెస్తారనేది ఆసక్తికరం! ఇంకోటి, కేంద్రంపై పోరాటం అని మిథున్ రెడ్డి అంటున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి కేంద్రంతో పోరాటం కాదు కదా! సామరస్యపూర్వకంగా, ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ హోదా గురించి ప్రధానిని అడుగుతూ, ఆయన మనసు మారేవరకూ ప్రయత్నిస్తామన్నారు కదా! అదనపు నిధుల కేటాయింపుల కోసం కూడా వినతులే ఇస్తామన్నారు. అంతేగానీ, పోరాటం అనే పంథాలో సీఎం కనిపించడం లేదు. మరి, మిథున్ రెడ్డి చెబుతున్న ఈ పోరాటం ఏంటో… పార్లమెంటులో ఎలా ఉంటుందో చూడాలి.