పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల చెల్లదంటూ అధికార పార్టీ వైకాపా హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ సరిగాలేదనీ, ఆయనకు సంబంధించిన చాలా వివరాలను రాజప్ప దాచిపెట్టారన్నది అభియోగం. గడచిన ఎన్నికల్లో ఆయన ఎన్నికల సంఘాన్ని తప్పుతోవ పట్టించారనీ, ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ పెద్దాపురం వైకాపా ఇన్ ఛార్జ్ వాణి కోర్టులో పిటీషన్ వేశారు. ప్రజాప్రతినిధిగా కొనసాగే అర్హత ఆయనకి లేదని ఆమె ఆరోపించారు.
రాజప్ప మీద విజయవాడ కోర్టులో ఒక కేసు ఉందనీ, దాని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉందని వాణి అంటున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసు అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఆ కేసులో కూడా రాజప్ప ముద్దాయిగా ఉన్నారనీ, 2007లో జరిగిన ఈ కేసును రాజప్ప ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని వాణి చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఉన్న కేసుల్ని, ఆదాయ మార్గాల వివరాలను తప్పులుగా చూపిస్తే… అనర్హత వేటు పడుతుందని వాణి అంటున్నారు. గతంలో ఆయన హోం మినిస్టర్ గా ఉన్నారనీ, ఎన్నికలూ నిబంధనలు పక్కాగా ఆయనే పాటించకపోతే ఎలా అన్నారు. తనకు వ్యవసాయం ద్వారానే ఆదాయం వస్తుందని అఫిడవిట్ లో చెప్పారనీ, ఆయనకి ఇతర ఆదాయ మార్గాలున్నాయనీ, ఎమ్మెల్సీగా ఉన్నారనీ ఆ తరువాత పెన్షన్ పొందుతూ ఆ వివరాలను కూడా చూపించలేదని వాణి చెప్పారు. సాంకేతికంగా ఇవన్నీ ఎన్నికల సంఘాన్ని తప్పుతోవ పట్టించిన అంశాల కిందకే వస్తాయనీ, కాబట్టి ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత వేటు తప్పదని ఆమె అంటున్నారు.
చినరాజప్ప మీద ఈ కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో… రాబోయే ఆరు నెలల్లో పెద్దాపురం ఎమ్మెల్యేగా వాణిని చూస్తామని వైకపా నేతలు నమ్మకంగా చెబుతున్నారు! సాంకేతికంగా ఆధారాలన్నీ తమకు బలంగా ఉన్నాయన్న ధీమాతో వాణి ఉన్నారు. మొత్తానికి, ఈ కేసు నేపథ్యంలో రాజప్ప వ్యవహారం కొంత ఆసక్తికరంగా మారింది. అఫిడవిట్ లో నిజాలు వెల్లడించలేదన్న అంశాన్ని కోర్టు ఎలా పరిగణిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో చినరాజప్ప స్పందన కూడా ఇంకా తెలియాల్సి ఉంది.