భారతీయ జనతా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్లో ఫుల్ టైమ్ వ్యవహారాలు చక్క బెడుతున్న ఉత్తరాది నేత సునీల్ థియోధర్.. టీడీపీని టార్గెట్ చేసుకుని చేస్తున్న ప్రకటనలు.. కలకలం రేపుతున్నాయి. చంద్రబాబును వ్యక్తిగతంగా.. టార్గెట్ చేస్తూ.. జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లలో ఆ పని పూర్తవుతుందంటున్నారు. అదే సమయంలో.. ఏపీలో ఇక తామే ప్రతిపక్షమని ప్రకటించుకోవడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడటం లేదు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం గుంటూరులో ప్రారంభించిన సునీల్ ధియోధర్.. తామే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమని ప్రకటించుకున్నారు.
టీడీపీలో అలజడి రేపడమే సునీల్ టార్గెట్..!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓటమి షాక్ నుంచి తేరుకోక ముందే.. ఆ పార్టీకి చెందిన కీలక నేతల్ని ఆకర్షించేందుకు బీజేపీ.. సునీల్ థియోధర్ ను ప్రయోగించింది. ఆయన ఏపీలోనే మకాం వేసి.. రోజువారీగా.. వ్యుహాలను ఖరారు చేసుకుంటున్నారు. తనదైన ప్రకటనలు చేస్తూ… టీడీపీ కార్యకర్తల్లో అలజడి రేపుతున్నారు బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా… తామే ప్రతిపక్షం అని ప్రకటించుకున్నారు. అంతకు ముందు ఆయన చంద్రబాబును జైలుకు పంపుతామని.. పదే పదే ప్రకటలు చేశారు. ఇప్పుడు.. మరో అడుగు ముందుకు వేశారు.
ఓట్లేయకపోయినా అధికారికంగా ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం..!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని… ప్రతిపక్ష హోదాను పొందాలనే ప్రయత్నం బీజేపీ తీవ్రంగా చేస్తోంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ల సహకారంతో ఆపరేషన్ చేస్తోంది. ఎన్నికల సమయంలో.. ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ అవసరాలు వారి ద్వారానే తీరాయి కాబట్టి… వారితో టచ్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అందర్నీ ఎలాగైనా.. ఒకే సారి .. గుప్పిట్లోకి తెచ్చుకుని… ప్రతిపక్ష హోదా అధికారికంగా పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఎమ్మెల్యేలు ముందూ వెనుకాడుతున్నారా..?
బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ. ధిక్కరిస్తే.. ఎం జరుగుతుందో.. ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అందుకే.. చాలా మంది.. బీజేపీతో సున్నం పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే.. టచ్లో ఉంటామని.. పార్టీలోకి ఇప్పుడిప్పుడే రాలేమని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడల్లా రావని.. భవిష్యత్ లో ఎం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుందని.. టీడీపీ నేతలకూ తెలుసు. బీజేపీలోకి వెళ్తే తాత్కలికంగా రక్షణ పొంద వచ్చు కానీ… రాజకీయ భవిష్యత్ అంధకారం అయిపోతుందని.. భావిస్తున్నారు. అందుకే.. డబుల్ గేమ్ ఆడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనికీ.. సునీల్ థియోధర్.. తనదైన మార్క్ పరిష్కారం చూపిస్తారంటున్నారు.