ఎలా అని అడక్కండి..! …
“ఆ ఒక్కటి అడక్కు”లో రాజేంద్రప్రసాద్ పదే పదే చెప్పినట్లు… ” ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ద కింగ్ ” అని బీజేపీ నేతలు పదే..పదే డైలాగ్ మార్చి.. చెబుతున్నారు. అవసరం అయితే ప్రకంపనలు సృష్టించేనా సరే… రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ.. ఎన్నో మార్పులు చేసి చూపిస్తామంటున్నారు. ఆ మార్పుల్లో ఫైనల్గా బీజేపీ.. అధికార పీఠంపై ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది.. కొత్తగా తెలంగాణ నుంచి కేంద్రమంత్రి అయి.. రెండు తెలుగు రాష్ట్రాలనూ చూసుకోవాల్సిన బాధ్యత అమిత్ షా తనకిచ్చారని చెప్పుకుంటున్న కిషన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఇది.
ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం.. విజయవాడ వెళ్లిన కిషన్ రెడ్డి.. అచ్చంగా ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో రాజేంద్రప్రసాద్ చెప్పినట్లే డైలాగ్ చెప్పారు. రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు వస్తాయన్నారు. అవేంటో ప్రజలే చూస్తారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం బీజేపీనేనని… ఈ తెలంగాణ నేత ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో … బీజేపీకి.. నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా ఏపీలో రాలేదు. ఆ విషయం కిషన్ రెడ్డికి గుర్తుందో లేదో మరి. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుని.. బలపడిపోతామని.. ఆయన అంచనా వేసుకుంటున్నట్లుగా ఉంది. ప్రస్తుతం కేసుల భయంతో.. రక్షణ కారణంతోనే.. బీజేపీలో నేతలు చేరుతున్నారు కానీ.. ఆ పార్టీ బలంగా ఉందని ఒక్కరూ చేరడంలేదు. రేపు ఎన్నికల సమయానికి వచ్చే సరికి.. వారంతా ఆ పార్టీలో ఉంటారో.. ఉండరో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుందని.. ఆ పార్టీ నేతలే హైకమాండ్ వద్ద మొరపెట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీలో బీజేపీ బలపడటానికి ప్రత్యేకమైన కార్యాచరణ ఇంత వరకూ ఎలాంటిదీ పెట్టుకోలేదు. నేతలని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అసలు ప్రజాభిమానం ఎలా పొందాలో మాత్రం.. పట్టించుకోడం లేదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి.. ఏపీ ప్రజల ఆకాంక్షలను తీర్చే ప్రయత్నం కొంతైనా చేస్తే.. ప్రజలు హర్షిస్తారు కానీ.. మాటలు చెప్పి.. ప్రకంపనలు సృష్టించి.. ఏపీపై పెత్తనం చేస్తామంటే.. ఎవరూ పరుగెత్తుకుంటూ వచ్చి కిరీటం పెట్టేయరు కదా..! ఈ మాత్రం కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు ఎందుకు ఆలోచించడం లేదో..?