“తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా” … తానా మహాసభలో వాషింగ్టన్లో జరుగుతున్నాయి. ఆ మహాసభలకు రాజకీయాలతో సంబంధం లేదు. కులాలు, మతాలతో సంబంధం లేదు. వ్యాపారాలు, కొన్ని రంగాలకే పరిమితం కాదు. అన్ని పార్టీల నుంచి.. అన్ని రంగాల నుంచి.. ప్రముఖులందర్నీ నిర్వాహకులు పిలిచారు. అందరూ వచ్చారు. తమ అనుభవాలను చెబుతున్నారు. తమ లక్ష్యాలను వివరిస్తున్నారు. ప్రవాసాంధ్రుల్ని ఎంటర్టెయిన్ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇలాంటి చోట్ల…సాధారణంగా ఎవరికీ నిరసన అనేది ఎదురు కాదు. అలా ఎదురయితే.. అది అసాధారణమే. అలాంటి పరిస్థితే.. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కు ఎదురయింది. కానీ.. ఆ నిరసన రామ్‌మాధవ్‌కు కాదని.. ప్రధాని మోడీకని.. ఆయన స్పీచ్ మొత్తాన్ని పరిశీలిస్తే.. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ చోటా రామ్‌మాధవ్‌కు గౌరవం..! ప్రసంగంలోనే నిరసన ఎందుకు..?
తానా మహాసభల నిర్వాహకులు.. పవన్ కల్యాణ్‌ను పిలిచినట్లే.. టీడీపీ నుంచి..వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి.. బీజేపీ నుంచి కూడా నేతల్ని పిలిచారు. దాదాపు అన్ని పార్టీల నుంచి నేతలు వచ్చారు. బీజేపీ తరపున రామ్‌మాధవ్ వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయకపోయినా… ఆయన .. బీజేపీలో.. అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తారు. వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుతుంది. బీజేపీ సాధిస్తున్న అప్రతిహత విజయాల్లో.. ఆయన పాత్ర ఉందని చెబుతూంటారు. దానికి తగ్గట్లుగానే ఆయనకు.. ప్రవాసాంధ్రులు గౌరవం ఇచ్చారు. ఉన్నత స్థితికి ఎదుగుతున్న తెలుగువాడిగా… పొగడ్తలను కూడా ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడైతే.. మోడీ జపం అందుకున్నారో.. అప్పుడు మాత్రమే.. సభలో అలజడి రేగింది. నిరసన ప్రారంభమయింది. ఆ మోడీ జపాన్ని ఆపకపోవడం వల్లే.. రామ్‌మాధవ్‌కు చేదు అనుభవం ఎదురయింది.
మోడీ ఏపీకి ఎంతో చేశారని చెప్పుడం వల్లే సభికుల్లో అసహనమా..?
రామ్‌మాధవ్ కేవలం బీజేపీ నేత అయినంత మాత్రాన.. అక్కడ నిరసన సెగ రాలేదు. అలా అయితే.. అంతకు ముందు.. వైసీపీ నేతలు.. కాంగ్రెస్ నేతలు కూడా.. తానా సభల్లో ప్రసంగించారు. అందర్నీ సభికులు.. చప్పట్లతో.. అభినందించారు కానీ… ఎవరికీ నిరసన తెలియచేయలేదు. ఎందుకంటే.. ప్రసంగించిన వారంతా.. రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు. తెలుగు ప్రజల ఐక్యత గురించి మాట్లాడారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మాట్లాడారు. ఎవరూ కూడా.. సొంత పార్టీ డబ్బా కొట్టేసుకుందామని అనుకోలేదు. రాజకీయ రాజకీయ అభిప్రాయాలు ఎవరికి వారికి ఉంటాయి. కానీ ప్రవాసాంధ్రులు.. వాటిని గుర్తు పెట్టుకుని.. ఇలా సభలకు వచ్చిన వారికి ఎప్పుడూ నిరసన సెగ తగిలేలా చేయలేదు. ఎప్పుడైతే.. అతిథులుగా వచ్చిన వారు తమ అభిప్రాయాలను రుద్దడం ప్రారంభిస్తారో.. అప్పుడే నిరసన బయటకు వస్తుంది. రామ్‌మాధవ్ కు అదే ఎదురైంది. రాజకీయాలకు సంబంధం లేదంటూనే… ఆయన మోడీ భజన ఎత్తుకోవడంతో.. అలజడి కనిపించింది.
ఆ నిరసన మోడీకే.. రామ్‌మాధవ్‌కు కాదు..!
తానా వేదికపై రామ్‌మాధవ్ చాలా అంశాలు మాట్లాడారు. తానా గురించి చెప్పారు…తెలుగు ప్రజల గురించి మాట్లాడారు.. సాహిత్యం గురించి..సమాజ సేవ గురించి చెప్పారు. ఆ మాటలన్నీ సభికులు శ్రద్ధగా విన్నారు. కానీ రాజకీయాలకు సంబంధం లేదంటూనే.. ఎప్పుడైనే.. మోడీ భజన స్టార్ట్ చేశారో.. అప్పుడే అసలు సినిమా చూపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ఎంతో చేశారని.. చెప్పి.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ప్రవాసాంధ్రులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఆ మోడీ భజన ఆగకపోయేసరికి.. ఆపే వరకూ నిరసన వ్యక్తం చేశారు. అక్కడ రామ్మాధవ్పై ఎవరికీ వ్యతిరేకత లేదు. కేవలం మోడీపై తిరస్కారభావం మాత్రమే… కనిపించింది. ఆ విషయం రాజకీయ వ్యహాల్లో రాటుదేలిపోయిన రామ్‌మాధవ్ .. అందరి కంటే ముందే.. తెలుసుకుని ఉంటారు..!