ఓ హిట్టొస్తే చాలు.. హీరో, డైరెక్టర్ చేతిలో అడ్వాన్సులు పెట్టేయడానికి మైత్రీ మూవీస్ ముందుంటుంది. మైత్రీ ఆఫీసులో ఇప్పటికీ కథలపై కుస్తీ చేస్తున్న దర్శకుల సంఖ్య పదికి పైనే. పరిశ్రమకు ఓ హిట్టొచ్చే కొద్దీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంఉటంది. తాజాగా మైత్రీ బ్యాచ్‌లో మరో కుర్ర దర్శకుడు చేరిపోయాడు. తనే… వివేక్ ఆత్రేయ. మెంటల్ మదిలో సినిమాతో ఆకట్టుకున్నాడు వివేక్. ఇప్పుడు `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్టు అందుకున్నాడు. వెంటనే మైత్రీ నిర్మాతలు వివేక్ చేతికి అడ్వాన్సులు కూడా అందించేశారు. ఇప్పుడు వివేక్ తదుపరి సినిమా మైత్రీలోనే ఉండొచ్చు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్కీ మంచి అవకాశాలే వస్తున్నాయి. తాజాగా కె.ఎఫ్.సీ అనే పంపిణీ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. `అర్జున్ రెడ్డి` సినిమాని విడుదల చేసింది ఆ సంస్థే. ఇప్పుడు స్వరూప్‌తో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యింది. మరోవైపు కోన వెంకట్ కూడా స్వరూప్‌కి అడ్వాన్స్ ఇచ్చినట్టు వార్తలు వినవస్తున్నాయి. మొత్తానికి చిన్న సినిమాలతో ఆకట్టుకున్న ఈ ఇద్దరు దర్శకులూ ఇప్పుడు నిర్మాతల కంట్లో పడ్డారన్నమాట.