సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం, విడుదలకు ముందు పదే పదే చూసుకుంటూ, మార్పులు చేర్పులూ చేసుకుంటూ వెళ్లడం – టాలీవుడ్‌కి అలవాటుగా మారుతోంది. విడుదలకు ముందు హడావుడిగా సినిమా ముగించడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉరుకులు పరుగుల మీద చేయడం, వేడి వేడిగా సినిమాని విడుదల చేసేసి – ఆ తరవాత `అయ్యో ఈ తప్పు జరిగిందా?` అని ఫీలవ్వడం బదులు.. ఇదే బెటర్ కూడా. నాగార్జున సినిమాలన్నీ ఇదే ప్రాతిపదికన సాగుతుంటాయి. డి.సురేష్ బాబు వ్యూహం కూడా ఇదే. నవతరం దర్శకులంతా.. ఈ చెక్కుడు కార్యక్రమాల్లో ఆరి తేరిపోతున్నారు. ఇప్పుడు ‘సైరా’ పద్ధతీ ఇంతే.
`సైరా` షూటింగ్ ఇటీవలే ముగిసింది. ఇప్పుడు రషెష్ చూసుకుంటూ కరక్షన్లు చేసుకుంటూ వెళ్తోంది చిత్రబృందం. చిరంజీవి ఈసినిమా విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల తరవాత కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా వచ్చిన ‘ఖైదీ నెం 150’ కంటే ఈ సినిమా విషయంలో చిరు పట్టుగా ఉన్నాడని మెగా కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి. ‘ఖైదీ నెం 150’ విషయాలన్నీ వినాయక్, రామ్ చరణ్‌లకే వదిలేసిన చిరు – ‘సైరా’ విషయానికి వచ్చేసరికి ప్రతీ విషయంలోనూ కలగ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇండ్రస్ట్రీలో తనకు ఆప్తులైన కొంతమందికి ఇప్పటికే ‘సైరా’ రషెష్ చూపించారట చిరు. వాళ్లు చెప్పిన మార్పులూ చేర్పుల్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మెరుగులు దిద్దుతూ వెళ్తున్నారని తెలుస్తోంది. చిరుకి అత్యంత ఆప్తుడైన రచయిత సత్యానంద్‌కి ఈ సినిమాలోని రషెష్ చూపించారని వినికిడి. త్వరలో కె.రాఘవేంద్రరావుకీ ‘సైరా’ రషెష్‌ని చూపించాలని అనుకుంటున్నాడట. వీలైతే రాజమౌళికీ `సైరా`ని ముందే చూపించి సలహాలు తీసుకోవాలని చిరు భావిస్తున్నాడట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ఇలంటి సినిమాలు తీయడంలో ఆరితేరిపోయాడు రాజమౌళి. తన సలహలు ఈ సినిమాకి తప్పకుండా పనికొస్తాయి. మరి రాజమౌళికి స్పెషల్ స్ర్కీనింగ్ ఎప్పుడో మరి.