ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో నవరత్నాలకు నిధులు కేటాయించిన తర్వాతనే.. ఇతర పథకాలకు నిధులు కేటాయించారని.. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నవరత్నాల కింద లబ్ధిదారుల ఎంపికను ప్రాధమికంగా అంచనాకొచ్చిన అధికారులను వీటి కోసం సుమారు రూ. 55 వేల కోట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ప్రణాళికేతర వ్యయంలో ఈ నిధులను చూపించాల్సి ఉంది. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం ఇవ్వటంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 9 వేల కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతోంది. వీటికి కూడా కచ్చితంగా కేటాయింపులు చేయాల్సి ఉంది.
అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, ఆశావర్కర్ల జీతాల పెంపు, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 12, 500 రూపాయలను ఏడాదికి కేటాయించటం, కౌలు రైతులకు సాయం, రైతులకు ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లింపులు చేయటం, రైతులకు జీరో శాతం వడ్డీపై రుణాలు మంజూరు చేయటం వంటి వాటితో బడ్జెట్ లెక్కలు నిండిపోనున్నాయి. గత ప్రభుత్వం రూ. 2 లక్షల 26 వేల కోట్ల రూపాయలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం రూ. 2 లక్షల 18 వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నవరత్నాలు కాకుండా.. ఇక కేంద్ర ప్రాయోజిత పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలు చెల్లించాల్స ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా తన వాటాగా 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. అలాగే పన్నుల వాటాగా.. వస్తుందని అంచనా వేసుకున్న దాంట్లో… కేంద్ర బడ్జెట్ రూ. 2వేల కోట్ల కోత పెట్టింది. గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులపై స్పష్టత లేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు.. ఎంత సాయం వస్తుందన్నదానిపై క్లారిటీ లేకపోయింది. పోలవరం, రాజధానికి ఒక్క రూపాయి అయినా కేటాయించే పరిస్థితుల్లేవని .. ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ బుగ్గనకు.. కత్తిమీద సాములా మారింది.