తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య భేటీ అయ్యారు, గోదావరి నుంచి కృష్ణకు నీళ్లు మళ్లించి రెండు రాష్ల్రాలూ వాడుకుందామని నిర్ణయించుకున్నారు, దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులకూ ఆదేశించారు. అయితే, ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగివి ప్రాథమిక చర్చలే అనుకోవచ్చు. ఇంజినీరింగ్ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఇవాళ్ల భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. గోదావరికి కృష్ణా జలాల మళ్లింపు అనేది భారీ ప్రాజెక్టు కాబోతుందని అధికారులు అంటున్నారు. కాబట్టి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఖర్చుకు సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు.
రాంపూర్ నుంచి నాగార్జున సాగర్ కి రెండు టీఎంసీలు నీళ్లు తీసుకెళ్తూ.. మధ్యలో మరో రెండు టీఎంపీలను శ్రీశైలం జలాశయానికి మళ్లించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన. పులిచింతల మీదుగా పోలవరం నుంచి జలాలను తీసుకొచ్చి, సాగర్ టెయిల్ పాయింట్ కి అనుసంధానించి… అక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి పంపాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన. తెలంగాణ ప్రతిపాదిత డిజైన్ ను యథాతథంగా నిర్మించాలంటే దాదాపు రూ. 85 వేల కోట్లకుపైనే ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు సమాచారం. అంటే, దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అయినంత ఖర్చన్నమాట! ఇక, ఏపీ అధికారులు ప్రతిపాదిత డిజైన్ కు రూ. 40 వేల కోట్లు అవుతుందనేది ప్రాథమిక అంచనాగా అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్ కి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా నిధులను సేకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ఇదే విషయమై ఆంధ్రాకి వచ్చేసరికి… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంత భారీ మొత్తంలో సర్దుబాటు ఎలా అనేదే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచనలు, ప్రతిపాదనలు కచ్చితంగా మంచివే. అయితే, అమలు దగ్గరకి వచ్చేసరికి… నిధుల సర్దుబాటు విషయంలో తెలంగాణ సీఎంకి ఉన్నంత వెసులుబాటు ఏపీ సీఎంకి లేదనేది వాస్తవం! అలాగని, ఈ ప్రతిపాదనల్ని ఇక్కడితో నీరు గార్చేస్తార్చేసే ఉద్దేశంలో ఏపీ సర్కారు లేదనీ అధికారులు అంటున్నారు. గోదావరికి కృష్ణా జలాల మళ్లింపు అనే అంతర్రాష్ట్ర ప్రాజెక్టును కొన్నాళ్లపాటు చర్చల దశలోనే ఉంచాలనేది ఉద్దేశంతో ఏపీ సర్కారు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం అంతర్గతంగా చర్చ జరగాలనీ, అనంతరం దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అధికారుల స్థాయిలో ఇప్పుడే కీలక చర్చలు మొదలయ్యాయి కాబట్టి, మరికొన్ని దఫాల సమావేశాలుంటాయని అంటున్నారు.