హైదరాబాద్: దేశం పరువు తీయొద్దంటూ విశాఖపట్నానికి చెందిన సుమిత్ అగర్వాల్ అనే ఇంజనీర్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అభ్యర్థించారు. షూస్ కొనుక్కోవాలంటూ కేజ్రీవాల్‌కు రు.364కు డీడీ కూడా జతచేసి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే ఇటీవల రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆయనకోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక విందు ఇచ్చారు. ఆ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. అయితే ఆయన తన కాళ్ళకు సాధారణమైన చెప్పులు వేసుకుని వెళ్ళారు. దీనిపైనే సుమిత్ అగర్వాల్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద అతిథులను, అగ్రనేతలను కలవటానికి వెళ్ళేటపుడు ఒక మర్యాద, సంప్రదాయం పాటించటం నేర్చుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించారు. సామాన్య పౌరుడిని ప్రతిబింబించటంకోసం కేజ్రీవాల్ అలా వెళ్ళటం తనను కలచివేసిందని లేఖలో పేర్కొన్నారు. తాను వీధుల్లో అడుక్కొని సేకరించిన సొమ్మును డీడీ రూపంలో పంపుతున్నానని, దీనితో ఒక మంచి షూ జత కొనుక్కోవాలని కోరారు. ఒక ముఖ్యమంత్రికి ఈ మొత్తం సరిపోదని తెలిసినప్పటికీ, నెలకు రు.2,10,000 జీతం తీసుకుంటూనే తనకు షూస్ లేవని చెప్పే వ్యక్తికి ఎంతయినా సరిపోదని సుమిత్ పేర్కొన్నారు. తాను పంపిన డబ్బుతో ఒక మంచి నలుపురంగు ఫార్మల్ షూస్ కొనుక్కోవాలని అభ్యర్థించారు.