కర్ణాటక రాజకీయంలో.. స్పీకర్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ” ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఇష్టానుసారంగా రాజీనామా చేసుకుని పోస్టుల్లో పంపిస్తే.. నేనేందుకు..?” అంటూ.. ఆయన… ఎంట్రీలోనే డైలాగ్ అదరగొట్టారు. దీంతో అందరి దృష్టి స్పీకర్ ఆఫీస్ వైపు పడింది. ఎమ్మెల్యేల రాజీనాల సంక్షోభం ప్రారంభమయిన తర్వాత తొలిసారి స్పీకర్ రమేష్ కుమార్… తన కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యెవరూ రాజీనామా చేసిన విషయం.. తన వరకూ రాలేదని స్పష్టం చేశారు. పోస్టులో, ఫ్యాక్సులో పంపిన రాజీనామాలను పరిగణనలోకి తీసుకోబోమని.. ఆయన పరోక్షంగా చెప్పారు. రోజంతా.. తాను స్పీకర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని.. ఎవరైనా వచ్చి కలవొచ్చని.. ఆఫర్ ఇచ్చారు.
అయితే.. స్పీకర్ ప్రకటనతో.. రెబల్ ఎమ్మెల్యేలకు చిక్కులు వచ్చి పడినట్లయింది. రాజీనామా చేసినట్లుగా ప్రకటించి.. బీజేపీ క్యాంప్‌నకు వెళ్లిపోయిన రెబల్ ఎమ్మెల్యేలు.. గోవాకు మకాం మార్చారు. వారంతా.. మూకుమ్మడిగా.. స్పీకర్ ఆఫీసుకు వచ్చి… రమేష్ కుమార్ ముందు హాజరు వేయించుకుని.. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరడం.. ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదన్న చర్చ నడుస్తోంది. ఓ వైపు.. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు.. కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో.. మంత్రి పదవులు కూడా.. రెడీగా ఉన్నాయని చెప్పేందుకు.. కాంగ్రెస్ మంత్రులందరితో రాజీనామా చేయించారు. జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో..రెబల్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే.. ఎటు వెళ్తారో చెప్పడం కష్టమన్న అభిప్రాయం ఉంది. ఎవరైనా రాజీనామా చేయడం లేదని అడ్డం తిరిగితే.. బీజేపీ ప్రయత్నం మరోసారి విఫలమయినట్లు అవుతుంది.
అయితే కర్ణాటక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూలగొట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజే్పీ.. ఆపరేషన్ ఆకర్ష్‌ను ఉద్ధృతంగా కొనసాగిస్తోంది. రోజుకో ఎమ్మెల్యేను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఒకరు బయటకు వస్తే.. మరొకరు.. గాలానికి చిక్కుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి.. రెబల్ క్యాంప్ నుంచి బయటకు వచ్చేశారు. అందరూ వస్తారని.. కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు.. కర్ణాటకంలో స్పీకర్ ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆయన ఏ మలుపులు తిప్పుతారో చూడాలి..!