గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించాలనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డ్రీమ్ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ ఇంజినీరింగ్ అధికారులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో… కొన్ని ప్రతిపాదనలపై చర్చించారు. కొత్తగా నిర్మించాల్సిన కాలువలు, వాటికి అవసరమైన భూసేకరణ, అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం… ఇలా అన్ని అంశాలపైనా మరింత లోతైన చర్చ జరగాలని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 13 లేదా 15న మరోసారి సమావేశమై చర్చించాలనీ, ఆ తరువాతే ముఖ్యమంత్రులకు నివేదికలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఈ చర్చల్లో, ఏపీ అధికారులు ప్రతిపాదనపై తెలంగాణ అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దుమ్మగూడెం నుంచి సాగర్ కీ, తుపాకులగూడెం నుంచి శ్రీశైలానికి నీటిని మళ్లించాలనేది ఏపీ ప్రతిపాదన. అయితే, దీని వల్ల తుపాకులగూడెం ముంపునకు గురౌతుందనీ, రెండు కాలువలూ తెలంగాణలోనే నిర్మించాలంటే…. భూసేకరణ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందనీ, ప్రతిపాదిత కాలువల ప్రాంతాల్లోని చాలా గ్రామాల నుంచి సమస్యలొస్తాయంటూ అధికారులు తిరస్కరించారు. తెలంగాణ అధికారులు ప్రతిపాదించిన… వైకుంఠపురం నుంచి పులిచింతలతోపాటు సాగర్ కి నీటిని మళ్లించొచ్చు అనే ఆలోచనపై ఏపీ అధికారులు తిరస్కరించారు. ఇదే అమల్లోకి తేవాలంటే పోలవరం కాలువను వెడల్పు చేయాల్సి వస్తుందనీ, అది అంత సులువగా జరిగే పని కాదని ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టీ ఎత్తు పెంచాక కృష్ణాలో కేవలం 400 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే అవకాశం ఉంటోందనీ, గోదావరిలో కూడా ఏడాదిలో దాదాపు 70 రోజులు మాత్రమే గరిష్టంగా వరద నీరు ఉంటుందనీ అంచనా వేశారు.
ఈ డ్రీమ్ ప్రాజెక్టుపై మరింత స్పష్టత రావాలంటే… మరిన్ని సమావేశాలు జరగాలని అధికారులు తేల్చారు. మరో దఫా చర్చలు జరిగాకనే ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తామన్నారు. ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక చర్చలుగానే చూడాలి. రెండు రాష్ట్రాలూ గోదావరి జిలాలను సమానంగా వాడుకునేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది కాబట్టి, దీనికి సంబంధించిన ఖర్చును కూడా ఏపీ తెలంగాణలు సమానంగా భరించాలనే అభిప్రాయమూ అధికారుల భేటీలో వ్యక్తమైంది. మొత్తానికి, ఇది రెండు రాష్ట్రాలకూ అత్యంత భారీ ప్రాజెక్టుగానే మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.