ప్రత్యేక హోదా విషయంలో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ఏపీ ప్రయోజనాల కన్నా.. రాజకీయ కోణంలోనే ఎక్కువగా.. నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని.. భారతీయ జనతా పార్టీ సర్కార్.. మొదటి నుంచి చెబుతోంది. అయితే.. వైసీపీ మాత్రం.. అడుగుతూనే ఉంటామని చెప్పుకుని అదే పని చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్నారు. ప్రధానిని కలిస్తే.. వినతిపత్రంలో దానికీ చోటిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం.. ఎన్ని సార్లు ఇలా అడిగినప్పటికీ.. ఒకటే సమాధానం చెబుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని.. చెబుతోంది.
హోదాపై పార్లమెంట్లో రోజూ ప్రశ్నలడుగుతున్న వైసీపీ ఎంపీలు..!
అయితే వైసీపీ మాత్రం.. కేంద్రంతో.. ప్రత్యేకహోదా ఇవ్వబోమనే ప్రకటనలు పదే పదే చేయించడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీలో అసెంబ్లీ తీర్మానం చేయడంతో.. ఏపీ రాజకీయాలకు సంబంధం ఉన్న నేతలందరూ స్పందించారు. పురందేశ్వరి సహా.. అందరూ ఏపీకి హోదా సాధ్యం కాదని.. ప్యాకేజీ తీసుకోవాలని జగన్కు సూచించారు. అదే సమయంలో.. ఎంపీలు రోజు మార్చి రోజు.. ఏదో ఓ సందర్భాన్ని పట్టుకుని.. పార్లమెంట్లో నేరుగా ప్రశ్నలు వేస్తున్నారు. ఓ సారి ఆర్థిక శాఖకు.. మరో సారి హోంశాఖకు.. ఇలా విడివిడిగా ప్రశ్నలు వేసి.. హోదా ఇచ్చేది లేదనే… లిఖితపూర్వక సమాధానాన్ని పొందుతున్నారు. అది మీడియాలో హైలెట్ అవుతోంది.
అడుగుతున్నాం.. బీజేపీ ఇవ్వట్లేదని చెప్పడానికా..?
మేము అడుగుతున్నాం.. బీజేపీ ఇవ్వనంటోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి వైసీపీ ఈ తరహా వ్యూహం పన్నుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. ప్రత్యేకహోదా అంశం.. ప్రజల్లో ఎంత ఎక్కువగా ఉంటే.. అంత మంచిదని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి ఏ మాత్రం సందు ఇచ్చినా.. అది రాజకీయంగా తనకు ఏ మాత్రం మంచిదికాదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని… అందుకే.. బీజేపీ విషయంలో.. జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. ఇతర అంశాల పేరుతో బీజేపీని ఇప్పుడు ఇరుకున పెట్టే పరిస్థితి లేదు. ప్రజల సెంటిమెంట్ పేరుతో.. హోదా విషయాన్ని మాత్రం.. బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకోవచ్చనుకుంటున్నారని తెలుస్తోంది.
మరి తదుపరి కార్యాచరణ ఏది..?
బీజేపీతో పదే పదే హోదా ఇవ్వబోమని.. చెప్పిస్తున్న వైసీపీ.. ఆ తర్వాత కార్యాచరణ ఏమిటో మాత్రం ఖరారు చేసుకోవడం లేదు. ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే… రాజీనామాలు చేసైనా.. కేంద్రం మెడలు వంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు.. వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. టీడీపీకి ఉన్న ముగ్గరూ… హోదా కోసం వైసీపీ రాజీనామాలు చేస్తే.. రాజీనామా చేయడానికి రెడీగా ఉంటారు. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హోదా పోరాటం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చేసిన సవాళ్లను.. గుర్తుకు తెచ్చుకోవడం లేదు.