పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులపై.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ .. ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్టును రద్దు చేసి.. ఇతరులకు ఇవ్వాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేసినట్లుగా.. ప్రచారం జరుగుతోంది. ఈ కమిటీ… పోలవరానికి సంబంధించి అన్ని ఫైళ్లనూ పరిశీలించి… సీల్డ్ కవర్లో.. సీఎంకు నివేదిక ఇచ్చింది. అంతిమంగా.. కాంట్రాక్టర్‌గా.. ట్రాన్స్ ట్రాయ్ ఫెయిలయిందని… ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి..మళ్లీ టెండర్లు పిలవాలని సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సబ్ కాంట్రాక్టర్లందరికీ చెక్ ..!
టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్కు.. రాష్ట్ర విభజన సమయంలో.. పోలవరం కాంట్రాక్ట్ దక్కింది. అయితే… పనులు నత్తనడకన సాగినప్పుడు… ఎవరూ పట్టించుకోలేదు… కానీ.. నిర్మాణ బాధ్యత ఏపీ సర్కార్ తీసుకున్న తర్వాత పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దానికి ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యం సరిపోలేదు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని.. చేతులెత్తేసింది. ఆ సమయంలో.. పనులు ఆగకుండా ఉండటానికి ట్రాన్స్ట్రాయ్ పేరుతోనే పనులు కొనసాగించి… కాంక్రీట్ వర్క్ నవయుగకు, మట్టిపనులు త్రివేణి , ఇతర పనులు మరికొన్ని సంస్థలకు ఇచ్చారు. పనులు మాత్రం ట్రాన్స్ట్రాయ్ పేరు మీదనే జరుగుతున్నాయి. బిల్లులు ఆ కంపెనీ పేరు మీదనే జారీ చేస్తారు. ట్రాన్స్ట్రాయ్ .. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. అయితే ఇది సాంకేతికంగానే. ఆర్థిక వ్యవహారాలతోనూ నేరుగా ఇప్పుడు ట్రాన్స్ట్రాయ్కు సంబంధం లేదు. ఇప్పుడు ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తే.. ఆటోమేటిక్‌గా.. సబ్ కాంట్రాక్టులన్నీ రద్దయిపోతాయి.
కేంద్రం ఇప్పుడు అంగీకరిస్తుందా..?
పోలవరం కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ ది వంద శాతం ఫెయిల్యూర్ స్టోరీ.నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఏపీ ప్రభుత్వమే… ఏదో విధంగా సర్దుబాటు చేసి.. సబ్ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి… కొన్ని పనులు చేయించింది. ట్రాన్స్ట్రాయ్ను తొలగించాలని.. గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కాంట్రాక్టర్ ను మార్చేందుకు కేంద్రం ససేమిరా అనడంతో… స్పిల్ వే, ఇతర పనులు చేపట్టాలంటే.. ప్రధాన కాంట్రాక్టర్ నుంచి కొన్ని పనులు తప్పించి.. ఇతరులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకారం కాంట్రాక్టర్ కు 60సీ కింద నోటీసులు ఇచ్చింది. ఇలా .. కొన్ని సబ్ కాంట్రాక్టర్లతో పనులు జరుగుతున్నాయి. పాత ధరలతోనే నవయుగ పనులు చేస్తోంది. పాత రేట్లకే ఒప్పించామని గడ్కరీ కూడా ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు.. ఏపీ సర్కార్.. ఆ కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయాలనుకుంటోంది. మరి కేంద్రం అంగీకరిస్తుందా.. అనేది కీలకం.
కొత్తగా టెండర్లు పిలిస్తే…పనులన్నీ మళ్లీ మొదటికి..!
ఒక్కో టెండర్ పూర్తయి పనులు ప్రారంభం కావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ ఆరు నెలలు పనులు ఆగిపోతే మళ్లీ గాడిన పెట్టడం కష్టమవుతుందన్నది.. నిర్మాణ రంగ నిపుణుల అభిప్రాయం. పైగా.. ట్రాన్స్ ట్రాయ్‌కు టెండర్ ఖరారు చేసి… ఏడేళ్లవుతోంది. ఏడేళ్ల కిందటి ధరలతో.. ఇప్పుడు.. కొత్తగా కంపెనీలు… పనులు చేయడానికి ముందుకు రావు. వచ్చినా.. ట్రాన్స్ట్రాయ్లా.. మధ్యలో చేతులెత్తయవన్న గ్యారంటీ లేదు. ఈ కారణంతోనే కేంద్రం కూడా.. కాంట్రాక్టర్ ను మార్చడానికి టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు అంగీకరించలేదు. పైగా న్యాయపరమైన సమస్యలూ.. కాంట్రాక్టర్ వైపు నుంచి వస్తాయన్న అభిప్రాయం కూడా ఉంది.