తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ సంక్రాంతి కీలకమైన సీజన్. పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు ఎలాగో.. కొత్త సినిమాలు అలాగ. ఎన్ని సినిమాలొచ్చినా సరే – ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ సంపాదించుకుందంటే… కాసుల వర్షం కురవడం ఖాయం. అందుకే ఈ సీజన్‌పై అగ్ర హీరోలు గురి పెడుతుంటారు. పండగ నాలుగు రోజులూ… నాలుగు కొత్త సినిమాలు విడుదలై, నాలుగూ ఆడేసిన సందర్భాలూ ఉన్నాయి.
2020 సంక్రాంతికీ పోటీ మామూలుగా లేదు. ఇప్పటికే మహేష్ సినిమా ‘సరి లేరు నీకెవ్వరు’ సంక్రాంతి కోసం కర్చీఫ్ వేసుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా ఆ జాబితాలో చేరింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్నిచిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బన్నీ సినిమానీ సంక్రాంతికే తీసుకురావాలని ముందే ప్లాన్ చేశారు. కానీ… సంక్రాంతి పోటీ దృష్ట్యా ఇంకొంచెం ముందు వచ్చేస్తే బాగుంటుందేమో ని పునరాలోచించింది చిత్రబృందం. చివరాఖరికి పండక్కే రావాలని డిసైడ్ అయ్యారు. సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే’ కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. ఓ మెగా హీరో బరిలో ఉండగా, మరో మెగా హీరో సినిమా పోటీగా వచ్చిన దాఖలాలు లేవు. మరి సాయి ధరమ్ తేజ్ వెనక్కి తగ్గుతాడో, లేదంటే – సమరానికి సై అంటాడో చూడాలి. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ – మురుగదాస్‌ల చిత్రాన్నీ సంక్రాంతికే తీసుకురానున్నారు. రజనీ సినిమా అంటే టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రభాస్ ‘జాన్’ కూడా సంక్రాంతికే రావొచ్చని అంటున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ కూడా పండగ సినిమానే. ‘సోగ్గాడే చిన్ని నాయన’కి ఇది రీమేక్. ‘సోగ్గాడే..’ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ కోసమైనా ఈ సినిమాకి సంక్రాంతికి విడుదల చేయాలని నాగ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. శర్వానంద్ ఇటీవలే ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి ‘శ్రీకారం’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీన్ని సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
మొత్తానికి ఈ సంక్రాంతి పోటీ మామూలుగా ఉండేట్టు కనిపించడం లేదు. అయితే ఈ సినిమాలన్నీ పండగ బరిలో ఉంటాయన్న గ్యారెంటీ లేదు. అన్ని సినిమాలూ ఒకేసారి వస్తే థియేటర్ల కొరత ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇందులో కొన్ని డ్రాప్ అయినా అవ్వొచ్చు. ఏ సినిమా వెనక్కి వెళ్లినా మహేష్, బన్నీ సినిమాలు మాత్రం ఫైనల్ లిస్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.