బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2014, 2019 ఎన్నికట్లో బాపట్ల నుంచి పోటీచేసిన సతీష్ ప్రభాకర్ పరాజయం పాలయ్యారు. లోకేష్ చుట్టూ ఉండే నేతలు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. తనకు పోటీగా నియోజకవర్గంలో మరో ఇరువుర్ని తయారుచేశారని ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. సతీష్ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేస్తారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరికి ఈయన అత్యంత సన్నిహితుడు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ , అన్నం సతీష్ ప్రభాకర్, బాపట్ల మాజీ ఎంపీ మాల్యాద్రి సుజనా చౌదరికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన పార్టీ మారినప్పటి నుంచి వీరు పార్టీ మారుతారని చెప్పుకున్నారు. కానీ ఎమ్మెల్యే అనగాని మాత్రం ఖండించారు.
సతీష్ గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మరో రెండేళ్ల రెండు నెలల వ్యవధి ఉంది. సతీష్ రాజీనామా వల్ల శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఒకటి తగ్గుతుంది. బీజేపీ, వైసీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. మరికొంతమందితో కూడా టచ్ లో ఉన్నారని తెలియటంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. వైసీపీకి శాసన మండలిలో మెజార్టీ లేకపోవటంతో ఈ వ్యూహంతో ముందుకెళ్తుందని టీడీపీ వర్గాలంటున్నాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొంతమంది మాజీ నేతలపై కూడా బీజేపీ తమతో చేరిన రాజ్యసభ సభ్యుల ద్వారా వల విసిరింది. వీరిలో కొంతమంది ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చందు సాంబశివరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా, అన్నం సతీష్ ప్రభాకర్ కూడా తాజాగా రాజీనామా చేశారు. ఇంకొందరు కాపు నేతలు పది, పదిహేను రోజుల్లో వీరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. బీజేపీలో చేరేవారికి అనర్హతా వేటు నుంచి మినహాయింపునిస్తే ఆరు నుంచి ఎనిమిది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ వర్గాలంటున్నాయి.