భారత క్రికెట్ అభిమానులకు ఇది చేదువార్తే. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. 240 పరుగుల విజయ లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జడేజా (77), ధోని (50) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ రెండు వికెట్లు స్వల్ప వ్యవధిలో కోల్పోవడం వల్ల భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు టాప్ ఆర్డర్ కుప్ప కూలడంతో 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సెంచరీ భాగస్వామ్యంతో భారత అభిమానుల్లో ఆశలు చిగురింపజేశారు ధోనీ, జడేజా. కానీ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ధోని, జడేజాలపై ఒత్తిడి పెరిగింది. వేగంగా పరుగులు చేయాలన్న ఉద్దేశంతో వికెట్లు పారేసుకున్నారు. 49వ ఓవర్లో ధోనీ రనౌట్ అవ్వడంతో మ్యాచ్ ముగిసింది.
నిజానికి 240 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాదు. భారత జట్టులో భీకరమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఓపెనర్లతో సహా కోహ్లీ ఫామ్‌లో ఉన్నారు. దాంతో భారత్ సునాయాసంగానే లక్ష్యాన్ని చేరుకుంటుందనిపించింది. అయితే ఓపెనర్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడం, కీలకమైన మ్యాచ్‌లో కోహ్లి చేతులు ఎత్తేయడంతో.. భారత్ కష్టాల్లో పడింది. మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా బుధవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా మారింది. ఔల్ట్ ఫీల్డ్ కూడా వేగంగా లేదు. దాంతో పరుగులు రావడం కష్టమైంది. నిజంగా బుధవారమే మ్యాచ్ ముగిసినట్టైతే, భారత్‌కు ఛేదన పెద్ద సమస్య అయ్యేది కాదు. పిచ్ ఓరకంగా దెబ్బతీస్తే… భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం మరింత కృంగదీసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంత్, కార్తీక్, పాండ్య… తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. జడేజా భారీ షాట్లతో అలరించి,స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు కాబట్టి సరిపోయింది, లేదంటే భారత్ మరింత భారీ తేడాతో ఓడిపోయేదే. మొత్తానికి న్యూజీలాండ్ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది. గురువారం ఆస్ట్రేలియా – ఇంగ్లండ్‌ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.