ఆర్.ఎక్స్ 100తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు కార్తికేయ. చడీ చప్పుడూ లేకుండా వచ్చిన ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. నిర్మాతల నెత్తిమీద కాసుల వర్షం కురిపించింది. దాంతో దర్శక నిర్మాతల దృష్టి కార్తికేయపై పడింది. తన రెండో సినిమా ‘హిప్పీ’ భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాపై నిర్మాతల అతి నమ్మకం వల్ల – అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టేశారు. పబ్లిసిటీ కూడా భీకరంగా చేశారు. కానీ.. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా చతికలిపడింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చాలా ఏరియాల్లో నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకోవడం వల్ల – నష్ట భారం మరింత ఎక్కువైంది. రూపాయికి రెండు రూపాయలు పెట్టి కొన్న నిర్మాతలు మొత్తం పోగొట్టుకున్నారు.
‘ఆర్.ఎక్స్ 100’తో వచ్చిన హైపు.. ‘హిప్పీ’తో పోయింది. ఆ ప్రభావం ఇప్పుడు ‘గుణ 369’పై పడింది. బోయపాటి శిష్యుడు అర్జున్ జంథ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ సినిమా బడ్జెట్ కూడా బాగానే అయినట్టు టాక్. ‘ఆర్.ఎక్స్ 100’ని చూసి ‘గుణ’ని కొనేస్తారని ఆశ పడ్డారు. కానీ మధ్యలో `హిప్పీ` వచ్చింది కదా.. ఆ ఫ్లాపుతో బయ్యర్లు ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా ఆగస్టు 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ రోజే నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’ విడుదల అవుతోంది. నాని సినిమా అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ‘గుణ’ రిజల్ట్ ఏమాత్రం తేడాగా ఉన్నా – వసూళ్ల పరంగా బాగా ప్రభావం చూపించేస్తుంది. అందుకే `గుణ`ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈసారి కూడా నిర్మాతలే ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ సినిమాకి ఏదోలా పబ్లిసిటీ పెంచి, హైప్ తెచ్చుకుని, ఏదో ఓ రేటుకి అమ్మేయాలని నిర్మాత భావిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.