తెలంగాణలో అధికార పార్టీ తెరాస ధాటికి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకునే ఛాన్స్ ఆ పార్టీకి తెరాస ఇవ్వడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తెరాస చేసింది. అధికార పార్టీని ప్రశ్నించే బలమైన వాయిస్ కాంగ్రెస్ కి లేదనే పరిస్థితి వచ్చింది. అయితే, ఈ మధ్య తెరాసకు ధీటుగా మాట్లాడే ప్రయత్నం భాజపా ప్రారంభించింది. రాష్ట్రంలో విస్తరించాలనే ధ్యేయంతో రంగంలోకి దిగిన భాజపా, అధికార పార్టీ తెరాసను టార్గెట్ చేసుకుంటోంది. అలాగని, తాము చేయలేని పనిని భాజపా చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంతృప్తి పడితే ఎలా ఉంటుంది..? మా కంటే వారే బెటర్ అని భాజపా ని మెచ్చుకుంటే ఎలా ఉంటుంది..? అదేంటో మరి, ఇదే పని చేస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి!
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కేసీఆర్ సర్కారు చేస్తోందన్నారు విజయశాంతి. ప్రభుత్వ అవినీతిపై ఎవరైనా మాట్లాడినా కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రి ఆ మధ్య బెదిరించారన్నారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వం మీద కేంద్రం నిఘా పెట్టిందనీ, ఇది తెలంగాణ ప్రజలకు శుభ పరిణామం అంటూ విజయశాంతి మెచ్చుకున్నారు. కేసీఆర్ పాలనపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తామని భాజపా నేతలు ప్రకటించడం మెచ్చుకోదగ్గది అన్నారు. కేసీఆర్ నియంతృత్వాన్ని కట్టడి చేసేవారు వస్తే బాగుండని ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, సరైన సమయంలో భాజపా రాష్ట్రంలో క్రియాశీలకమౌతోందన్నారు. అయితే, కేసీఆర్ పాలనపై కేవలం నిఘా పెట్టించి నివేదికలు తెప్పించుకున్నంత మాత్రాన సరిపోదనీ, అవకతవకలపై వెంటనే భాజపా సర్కారు చర్యలు తీసుకోవాలని కూడా విజయశాంతి సూచించారు.
కేసీఆర్ సర్కారు మీద భాజపా నిఘా పెడితే… కాంగ్రెస్ నాయకురాలిగా విజయశాంతి మెచ్చుకోడమేంటీ..? భాజపాని వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడితే… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమౌతుంది..? తెరాసకు తాము ప్రత్యామ్నాయం కాదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నట్టు లేదూ! తమకంటే, తెరాసను ఎదుర్కొనే దమ్మూ ధైర్యం భాజపా ఉందని సందేశం ఇస్తున్నట్టు లేదూ! ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలహీనడేందుకు ఆ పార్టీ నాయకులే స్వయంగా గోతులు తవ్వుకున్నట్టు లేదూ! తెలంగాణలో భాజపా యాక్టివ్ అయితే… ప్రజలకు మంచి రోజులు వచ్చాయని మెచ్చుకుంటూ ఆ పార్టీకి మేలు చేస్తున్నట్టుగా విజయశాంతి మాట్లాడుతున్నారు. అసలే జంపింగుల సీజన్ ఇది..! టి. కాంగ్రెస్ నేతలు కాస్త తేడాగా ఏ కామెంట్ చేసినా.. దాని వెనక ఇంకోదే అర్థం ధ్వనిస్తుంటుంది కదా!