మున్సిపల్ ఎన్నికల నోటిఫికేన్ ఈ వారం తరువాత ఎప్పుడైనా రావొచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి హడావుడి మొదలైంది. వరుస ఓటమిని ఎదుర్కొంటున్న పార్టీ… పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలనే సంకల్పంతో ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, సంపత్ లతో కూడిన కమిటీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలపై చర్చలు సాగించింది. ఈ పురపాలక ఎన్నికలు కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమారెడ్డి ఆధ్వర్యంలోనే పార్టీ నాయకత్వమంతా నడవాల్సిన సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో సమావేశాలు ముగిశాయి కాబట్టి, త్వరలోనే మున్సిపల్ స్థాయిలో కూడా ఎన్నికల సమాయత్త సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. ఈ సమావేశాల్లోనే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఉత్తమ్ చెప్పారు.
అభ్యర్థులు అనగానే… కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది కదా! అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నియోజక వర్గాల్లో దాదాపు 25 మందికి మించి ఆశావహులు టిక్కెట్ల కోసం పోటీ పడ్డారు. చివరికి, ఒకరికి దక్కేసరికి… మిగతా అసంతృప్తులు పార్టీకి సమస్యగా మారింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ తలనొప్పి మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి, ఒక్కో స్థానం నుంచి ఇద్దరు ఆశావహుల పేర్లు మాత్రమే ఫైనలైజ్ చేయాలనీ, ఇప్పుడు జరగబోయే సమావేశాల్లోనే ఆశావహులందరితోనూ చర్చించి… ఇద్దరి పేర్లను మాత్రమే అంతిమంగా ఉండేలా చూడాలంటూ జిల్లా ఇన్ ఛార్జ్ లకు ఉత్తమ్ ఆదేశించారు.
ఇద్దరు ఆశావహులు మాత్రమే ఉండేలా చేయడం మంచి వ్యూహమే. కాకపోతే, ఈ ఇద్దర్ని ఎంపిక చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలోనే జరగాలి కాబట్టి, అక్కడ ఆశావహులు ఎలా వ్యవహరిస్తారో అనేదే ప్రశ్న! ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ ఇద్దరు ఆశావహుల ఎంపిక ప్రక్రియ మరింత గందరగోళానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందా అనే అనుమానం పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతోంది! ఏదైమైనా, 15వ తేదీలోగా ఆశావహుల జాబితా రెడీ అయిపోవాలనీ, నోటిఫికేషన్ రాగానే అభ్యర్థుల ప్రకటన వెంటనే చేసేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉత్తమ్ కనిపిస్తున్నారు.