కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలేమీ బాగోలేదు. ఏ రాష్ట్రంలోనూ.. ఆ పార్టీకి సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అయితే.. ఆ పార్టీని ప్రత్యక్షంగా.. బీజేపీ నిర్వీర్యం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలే.. ఆ “పుణ్యాన్ని” మూటగట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా.. కాంగ్రెస్ పార్టీ నేతలుగా చెలామణి అయి.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. భారతీయ జనతా పార్టీ.. పిలిచినా.. పిలవకపోయినా.. పోయి ఆ పార్టీలో చేరేందుకు పరుగులు పెడుతున్నారు. తెలంగాణతో ప్రారంభమయింది. ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అన్న హోదాను కూడా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీసేస్తున్నారు. తమకు మంత్రి పదవులో.. మరో ప్రయోజనం కోసమో.. తమ పార్టీకి టెండర్ పెట్టేశారు.
కర్ణాటక ఎపిసోడ్ సాగుతూండగానే.. గోవా కాంగ్రెస్ నాయకులు.. తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు. గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలుండగా, బుధవారం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దాంతో.. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అయినట్లుగా.. స్పీకర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ కూడా బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.
గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. పదిహేడు సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీకి వచ్చింది పదమూడు సీట్లే. అయితే.. గోవా ఫార్వర్డ్ , మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఎన్సీపీలతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మద్దతు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దర్నీ తన.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దర్నీ బీజేపీలో చేర్చుకుంది. మొత్తానికి పదిహేడు సీట్లకు చేరింది. అయినా ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలో… ఏకంగా కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తూ… పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ బలం 27కి పెరిగింది. గోవాలో కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది.