తెలంగాణలో పట్టు బిగించడం కోసం భాజపా తీవ్రంగానే కృషి చేస్తోంది. గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాజపా టార్గెట్లలో కరీంనగర్ జిల్లా ఒకటుంది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలిచారు. దీంతో, ఇప్పుడు జిల్లాలో పట్టు సాధనకు సంజయ్ కుమార్ కు ప్రాధాన్యత కల్పిస్తోంది భాజపా. ముందుగా, కరీంనగర్ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి ఆకర్షించే పనిలో ఆయన ఉన్నారని సమాచారం.
దీంతో తెరాస కూడా అప్రమత్తమైంది. జిల్లాలో సంజయ్ కు ప్రాధాన్యత దక్కకుండా చేయాలని ప్రయత్నిస్తోందట. అదెలా అంటే, ఆయన ఎంపీ కాబట్టి, స్థానికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ, ప్రారంభోత్సవాలకూ ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని తెరాస సర్కారు ఆహ్వానించాల్సి ఉంటుంది. దాన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది తెరాస! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. కానీ, కూర్చోవడానికి ఆయనకంటూ ఒక స్థానం కల్పించలేదు. దాంతో మాజీ ఎమ్మెల్యేలు కూర్చునే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. జిల్లాలో ఓ తాసిల్దార్ కార్యాలయానికి జరిగిన ప్రారంభోత్సవానికి కూడా ఆయన్ని పిలవలేదు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరుకు ప్రాధాన్యత దక్కలేదు. ఎక్కడో చివర్లో… స్థానిక నేతల తరువాత ఆయన పేరును చిన్న సైజ్ లో రాశారట. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తూములు ఏర్పాటు కార్యక్రమానికి ఎంపీ సంజయ్ ని పిలవలేదు, శిలాఫలకంపై పేరు కూడా వెయ్యలేదు. దీంతో ఆయన ఆగ్రహించి.. కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
ప్రోటోకాల్ పేరుతో ప్రతీ కార్యక్రమానికీ ఆయన్ని పిలుచుకుంటూ పోతే…. ఓరకంగా భాజపా బలోపేతానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందనేది తెరాస అభిప్రాయంగా తెలుస్తోంది. తెరాస నేతలతో అత్యధిక సంఖ్యలో జరిగే ఏ స్థాయి కార్యక్రమానికీ భాజపా నేతల తాకిడి లేకుండా చూసుకోవాలనీ, ప్రోటోకాల్ ఉన్నా కూడా పక్కనపెట్టేయాలనీ, ఆ గొడవను వేరేగా డీల్ చేసుకోవచ్చు అనేది తెరాస అధినాయకత్వం ఆలోచనగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కల్లోనే బండి సంజయ్ కుమార్ కి ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదు. అయితే, ఈ విషయాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుటికే దీనిపై ఢిల్లీ వరకూ ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. ప్రోటోకాల్ పాటించకపోవడం అనే ఒక కారణం భాజపాకి చాలదా..? ఇది సరైన వ్యూహం ఎలా అవుతుంది..? ఈ అంశానికి ప్రాధాన్యత పెంచినట్టు అవుతోంది కదా!