మొత్తానికి బిగ్ బాస్ వ్యవహారం కూడా చిక్కుల్లో చిక్కునేలా కనిపిస్తోంది. తెలుగు బిగ్ బాస్ వ్యవహారాలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. బిగ్ బాస్ కూడా కాస్టింగ్ కౌచ్ కు అతీతం కాదని ఆరోపణలు వచ్చేసాయి. యాంకర్ శ్వేతారెడ్డి బాహాటంగా బిగ్ బాస్ పై గొంతు విప్పారు. మీడియా ముందుకు వచ్చి బిగ్ బాస్ నిర్వహణ చూసే బిగ్ బాస్ ఒకరు తనను ‘కమిట్ మెంట్’ అడిగారని తీవ్రమైన ఆరోపణ చేసారు.
”..‘‘బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ను ‘ఇంప్రెస్’ చేయాలట! ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా? తెలుగువాళ్లపై గలీజ్ కల్చర్ రుద్దుతామంటే ఊరుకోం. బిగ్‌బాస్-3ని నిషేధించాలి. తెలుగు టీవీ నుంచి వెలివేయాలి… బిగ్‌బాస్ వల్ల ఎవరూ బాగుపడలేదు. బిగ్‌బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా?’’
ఇవీ శ్వేతారెడ్డి మాటలు.
శ్వేతారెడ్డి రెండు రోజుల క్రితమే ఓ ఛానెల్ లైవ్ లోకి వచ్చి బిగ్ బాస్ పై ధ్వజమెత్తారు. ఆ తరువాత మళ్లీ మీడియా మీట్ పెట్టి మరీ బిగ్ బాస్ పై ధ్వజమెత్తారు. దీని వెనకాల ఏం వుంది? ఏం జరిగింది? అన్నది బిగ్ బాస్ నిర్వాహకులకు, శ్వేతారెడ్డికే తెలియాలి.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం శ్వేతారెడ్డిని బిగ్ బాస్ నిర్వాహకులు కలిసింది నిజం. అగ్రిమెంట్ తీసుకున్నది నిజం. ఎవరిని అయితే బిగ్ బాస్ షో కి పనికి వస్తారు అని అనుకుంటారో వాళ్లని నిర్వాహకులు సంప్రదిస్తారు. అప్పుడే ముందుగా వారి దగ్గర ఓ కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ తీసుకుంటారు. అందులో బోలెడు క్లాజ్ లు వుంటాయి. షో కి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అన్న క్లాజ్ కూడా వుంటుందని తెలుస్తోంది.
అందువల్ల శ్వేతారెడ్డి లీగల్ గా బిగ్ బాస్ నిర్వాహకులను ఏమీ చేయలేకపోవచ్చు.పైగా ఆమె చేస్తున్న ఆరోపణలు ఏవీ లీగల్ గా నిల్చునేవి కాదు. కానీ శ్వేతారెడ్డి బాహాటంగా గొంతెత్తడం ద్వారా షో మీద జనాలకు అనుమానాలు రేకెత్తడం మాత్రం ఖాయం. అంతే కాదు, నాగార్జున లాంటి హీరో షో ను చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటివి అన్నీ ముదిరితే ఇక సోషల్ మీడియా ఒక లెవెల్ లో గొంతు ఎత్తుతుంది.
అసలే బిగ్ బాస్ సీజన్ 2 నుంచి విపరీతమైన ట్రోలింగ్ వుంది. సీజన్ 3 స్టార్ట్ కాకుండానే నాగార్జున మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కాన్సెప్ట్ మంచిది కాదు, నచ్చదు అని చెప్పి, ఆ షో ఎలా హోస్ట్ చేస్తారంటూ విమర్శలు కురుస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఇక కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా వచ్చాయి అంటే ఇక బిగ్ బాస్ కాస్తా బిగ్ మెస్ అవుతుందేమో?