ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం…తొలి బడ్జెట్లో సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించింది. సంక్షేమ పథకాల కోసం… సింహభాగం నిధులు కేటాయించారు. మొత్తం పద్దు రూ.2 లక్షల 27 వేల 974 కోట్లుగా తేల్చారు. రెవెన్యూ లోటు- రూ.1,778.52 కోట్లుగా అంచనా వేశారు. గతంతో పోలిస్తే మొత్తం బడ్జెట్ 19.32 శాతం పెరిగింది. రెవెన్యూ వ్యయం 20.10శాతం పెరుగుతుందని అంచనా వేశారు. బడ్జెట్లో నవరత్నాలకు పెద్ద పీట వేశారు. అయితే.. ముందుగా చెప్పినట్లుగా.. అంచనా వేసినన్నీ నిధులు కేటాయించ లేదు.
అమ్మ ఒడి, రైతు భరోసా లబ్దిదారులను తగ్గించాల్సిందేనా..?
రైతులకు.. వైఎస్ఆర్ భరోసా కింద … రూ. 12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు… రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మంది రైతులకు ఇవ్వాలంటే.. దాదాపుగా రూ. 13 వేల కోట్లు కావాలని గతంలోనే ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేశారు. అయితే.. రైతు భరోసాకు వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8, 750 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏ చూసినా.. రూ. నాలుగు వేల కోట్లు తగ్గుతాయి. అంటే.. కొంత మంది లబ్దిదారుల్ని ఫిల్టర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మరో నవరత్న పథకం… అమ్మఒడికి కూడా.. కావాల్సినన్నీ నిధులు కేటాయించలేకపోయారు. ఈ పథకానికి రూ.6,455 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాియంచారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే… విద్యార్థులందరితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎలా చూసినా.. ఏపీలో 70 శాతం కుటుంబాల్లో ఇంటర్ లోపు చదువుకునే పిల్లలు ఉంన్నారు. వీరిలో ధనవంతుల్ని తీసేసిన.. అరవై శాతానికిపైగా కుటుంబాలకు… అమ్మఒడి సాయం చేయాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబానికి రూ. పదిహేను వేలు ఇవ్వడానికి రూ. రూ.6,455 కోట్లు ఏ మాత్రం సరిపోవు. మరో రూ. పదివేల కోట్లు అవసరమవుతాయని అంచనా. పరిమితంగా నిధులు కేటాయించారు కాబట్టి.. అమ్మ ఒడిలోనూ లబ్దిదారుల్ని ఫిల్టర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా కేటాయించలేదేం..?
ఇతర సంక్షేమ పథకాలకు కూడా నిధులు భారీగానే కేటాయించారు. 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు, విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు, ఫసల్ బీమా యోజనకు రూ.1,163 కోట్లు కేటాయించారు. సాగునీటిశాఖకు రూ.13,139 , అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు, ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు కేటాయించారు. విద్యుత్ ఒప్పందాల్లో అదనపు ఖర్చు పెట్టారని.. గత ప్రభుత్వం నిర్ణయాలపై కమిటీ వేసిన జగన్.. ఎంత ఆదా చేస్తామో మీరే చూస్తారని ప్రకటించారు. తీరా బడ్జెట్లో అదునపు కొనుగోళ్ల కోసం మరో రూ. రెండు వేల కోట్లు కేటాయించారు. వైఎస్సార్ గృహ వసతికి రూ. 5 వేల కోట్లు, పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు మరో రూ.1,370 కోట్లు, బలహీనవర్గాల ఇళ్లకు రూ.1,280 కోట్లు, వైఎస్సార్ అర్బన్ హౌసింగ్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో.. బియ్యంపై సబ్సిడీకి రూ. మూడు వేల కోట్లు కేటాయించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, వైఎస్సార్ బీమాకు రూ. 404 కోట్లు, గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు, మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు, మున్సిపల్ వార్డు సెక్రటేరియట్‌కు రూ.180 కోట్లు కేటాయించారు. రోజాకు చైర్మన్ గిరీ ఇచ్చిన ఏపీఐఐసీకి రూ.360 కోట్లు కేటాయించారు. డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లు ఇచ్చారు. ఉపాధిహామీ పథకానికి రూ.500 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.300 కోట్లు కేటాయించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానన్న జగన్ .. ఆ రుణాల మాఫీకి మాత్రం.. రూపాయి కూడా కేటాయించలేదు. అయితే.. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1,140 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.648 కోట్లు కేటాయించారు.
అంత హడావుడి చేసిన సున్నా వడ్డీ రుణాలకు రూ. వంద కోట్లేనా..?
ఇరిగేషన్, వరద ముంపు నివారణకు రూ.13,139 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు , విద్యుత్- రూ.6,861 కోట్లు, రవాణా- రూ.6,157 కోట్లు, ఇండస్ట్రీ మినరల్స్‌కు రూ.3,986 కోట్లు, జనరల్ ఎకో సర్వీసెస్ రూ.6,025 కోట్లు, సాధారణ విద్య- రూ. 32,618 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు కేటాయించారు. వ్యవసాయ బడ్జెట్‌ను.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్లను వ్యవసాయరంగానికి కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం-రూ.27,946 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.919 కోట్లుగా చూపించారు. అయితే.. ఇది బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న అంకెలతోనే ఉంది. కొసమెరుపేమిటంటే… సున్నా వడ్డీ రుణాలకు.. ఏడాదికి రూ. రెండు వేల కోట్లకుపైగా అవుతాయని అసెంబ్లీలో కుండబద్దలు కొట్టిన ప్రభుత్వం.. బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ. వంద కోట్లు. తెలుగుదేశం సర్కార్.. సగటున ఏడాదికి రూ. రెండు వందల కోట్లు.. వడ్డీ లేని రుణాల కోసం ఖర్చు చేసింది.