కర్నాటకలో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. రెండు వారాలుగా సాగుతున్న పొలిటికల్ డ్రామా కొత్త మలుపు తీసుకుంటోంది. అయితే అంతా క్లైమాక్స్ చేరుకుందనుకున్న సమయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు సీఎం కుమారస్వామి. ఓ వైపు ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో తప్పుకుంటున్నా.. కుమారస్వామి మాత్రం బలపరీక్షకు సై అన్నారు. డేట్ టైమ్ చెబితే తన బలమెంటో నిరూపించుకుంటానని చెబుతున్నారు. రాజీనామాలు, కోర్టులు, పొలిటికల్ ఎత్తుల చూట్టు తిరుగుతున్న కర్నాటకంలో.. సీఎం నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
రాజీనామాలు ఆమోదించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. కాసేపటికే కుమారస్వామి విశ్వాస పరీక్షకు సై అన్నారు. ఎలాంటి సంక్షోభమైనా సరే… శాసనసభ సాక్షిగా ఎదుర్కొంటానంటూ సవాల్ విసిరారు. కుమారస్వామి నిర్ణయం… రాజకీయ వర్గాల్లో సంచలనమవుతోంది. అటు బీజేపీ కూడా డిఫెన్స్‌లో పడింది. నిజానికి విశ్వాస పరీక్షలోపు రాజీనామాలు ఆమోదం పొందకుంటే… అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధమని చెప్పగానే… బీజేపీ నేతలు అలర్టయ్యారు. నెంబర్ గేమ్ మొదలు కావడంతో ప్రతి ఎమ్మెల్యేను కాపాడుకునే పనిలో పడ్డారు.
సంకీర్ణ కూటమి సమన్వయకర్తగా ఉన్న సిద్ధరామయ్య బీజేపీపై మైండ్ గేమ్ ప్రారంభించారు. విశ్వాస పరీక్షకు బీజేపీ నేతలు భయపడుతున్నారని.. ఎందుకంటే వారిలో కొందరు గొర్రెలు ఉన్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఒకేవేళ తాజా సంక్షోభంతో అధికార మార్పిడి జరగకపోతే… బీజేపీ పరువు పోతుంది. ఒక వేళ సాధ్యం కాకపోతే.. అసలు జేడీఎస్‌నే.. తమ వైపు లాక్కోవాలని.. బీజేపీ ప్రయత్నిస్తోంది. కుమారస్వామి సోదరుడు రేవణ్ణతో బీజేపీ కర్నాటక ఇంఛార్జ్ మురళీధరరావు భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవణ్ణకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి… ఆయన అనుచర ఎమ్మెల్యేలను కలుపుకునిపోతారన్నప్రచారం సాగుతోంది. అయితే కుమారస్వామి మాత్రం బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. మొత్తంగా ఈ తరహా ప్రచారం కూడా ఆసక్తి రేపుతోంది.
కర్నాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224. అయితే కాంగ్రెస్‌కి 78 మంది సభ్యులు, జేడీఎస్‌కి 37, బీఎస్పీ ఒక సభ్యుడు ఉన్నారు. బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇద్దరు స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలుకుతుండటంతో ఆ సంఖ్య 107కి చేరింది. సంకీర్ణ సర్కార్ మద్దతు 116గా ఉండగా… 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు ఆమోదిస్తే కూటమి బలం 100కి పడిపోతుంది. ఇప్పుడు ఎలా చూసినా బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.