ఎన్నికల్లో తన విజయం కోసం ప్రచారం చేసిన సినీతారలకు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవుల పంపకం ప్రారంభించారు. మొట్టమొదటగా.. కమెడియన్ “ధర్టీ ఇయర్స్” ఫృద్ధ్వీకి కీలకమైన పదవి ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్… ఎస్వీబీసీకి చైర్మన్గా…ఫృద్ధ్వీని నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ కావడంతో… ఫృద్ధ్వీ.. జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమలో చాలా మంది నటుల కన్నా.. ముందుగా.. జగన్మోహన్ రెడ్డికి ఫృద్ధ్వీ మద్దతుగా నిలిచారు. ఆయన జగన్ను సపోర్ట్ చేయడానికి పవన్ కల్యాణ్ పై కూడా.. తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల సినీ పరిశ్రమ నుంచి అవకాశాల్ని కోల్పోతున్నారన్న ప్రచారం జరిగింది.
ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి .. పిలిచి మరీ కీలక పదవిని ఇచ్చారు. ఎస్వీబీసీ చైర్మన్ గా గతంలో… ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఉండేవారు. ఇప్పుడు.. ఆ స్థానాన్ని ఫృద్ధ్వీ భర్తీ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దక్కిన మొదటి పదవి ఎస్వీబీసీ చైర్మన్ పదవినే. త్వరలో మరికొంత మందికి కూడా పదవులు దక్కుతాయని చెబుతున్నారు. కమెడియన్ అలీ.. మంత్రి అవ్వాలన్న లక్ష్యంతో.. వైసీపీలో చేరారు. టిక్కెట్ దక్కకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆశిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక మరో సినీ ప్రముఖుడు, జగన్ కు బంధువు కూడా అయిన… మంచు మోహన్ బాబుకు.. ఏ పదవి ఇస్తారన్నదానిపై క్లారిటీ లేదు. కొద్ది రోజులుగా.. ఆయన పేరు పలు పదవులకు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఏదీ ఖరారు చేయలేదు. చోటా కే నాయుడు, కృష్ణుడు, జీవితా రాజశేఖర్, పోసాని కృష్ణమురళీ, జయసుధ సహా.. టీవీ రంగానికి చెందిన ..పలువురు నటులు ద్దతు తెలిపారు. వీరందరూ.. తమకు ఏదో ఓ పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వీరందర్నీ ఎప్పుడు కరుణిస్తారో మరి..!