భారతీయ జనతా పార్టీ ఆదివారం నుంచి ఏపీపై దండయాత్ర చేయబోతోంది. ఇక వారం వారం.. కేంద్రమంత్రుల్ని కీలక నేతల్ని వరుసగా రంగంలోకి దింపి.. చేరికల హడావుడి ప్రారంభించాలనుకుంటోంది. సుజనా చౌదరిని లీడర్‌గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి రేపు విజయవాడ రాబోతున్నారు. ఆయనను గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అత్యంత భారీ ర్యాలీగా విజయవాడ బీజేపీ ఆఫీస్‌కు తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం విజయవాడ, గుంటూరు నగరాల్లో బీజేపీ ఆదివారం కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. బీజేపీ అగ్రనేతలైన రాంమాధవ్ తోపాటు ఇన్చార్జ్ లు సునీల్ ధియోదర్, శివరాజ్ సింగ్ చౌహాన్, రాంలాల్, సతీష్ జీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.
విజయవాడలో ఢిల్లీ నుంచి వస్తున్న బీజేపీ అగ్రనేతలతో ఆదివారం ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సందర్భం తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలను బీజేపీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడుగా పనిచేసిన చందు సాంబశివరావుతోపాటు మరి కొంతమంది ద్వితీయశ్రేణి నేతలు ఆదివారం అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. అయితే..రేపు బీజేపీలో ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని కన్నా లక్ష్మినారాయణ చెబుతున్నారు. వారెవరో.. ఆదివారం తెలుస్తుందంటున్నారు.
అయితే బీజేపీలో నేతలను చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదని చెబుతున్నారు. రాయలసీమ నుంచి టీడీపీకి చెందిన కొంతమంది మాజీ నేతలు బీజేపీలో చేరుతారని తొలుత భావించారు. అయితే ఇటీవల వరకు ఆ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నప్పటికీ, గత పదిహేను రోజుల నుంచి చేరికలను మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారంటున్నారు. చేరికలు, ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్ ను ఉపయోగించుకుని కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి స్వతంత్రంగానే ఎదిగే దిశగా ముందుకు కదలాలని బీజేపీ వ్యూహా రచనలు చేస్తోంది. వైసీపీపై అనుకున్నట్లుగా విమర్శలు చేస్తున్నా.. చేరికలు మాత్రం.. ఆశించిన విధంగా ఉండటం లేదు.