టిడిపి నుండి బీజేపీ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఏళ్ల తరబడి టిడిపి ని అంటిపెట్టుకుని ఉన్న సుజనా చౌదరి , సీఎం రమేష్, అంబికా కృష్ణ లాంటి నేతలు సైతం బిజెపిలోకి ఫిరాయించారు. మరి కొన్ని రోజుల్లో టిడిపి ఎమ్మెల్యేలను సైతం లాగేసుకుని తెలుగుదేశం పార్టీని పూర్తిగా బిజెపిలోకి విలీనం చేయించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంతో పూర్తిగా నాయకుల మీద ఆధారపడిన బిజెపి సైతం టిడిపిలో నుండి బీజేపీలోకి రావాలనుకున్నా, అ ఆరుగురు నేతలని మాత్రం చేర్చుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
జేసీ దివాకర్ రెడ్డి,
చింతమనేని ప్రభాకర్,
దేవినేని ఉమా,
వల్లభనేని వంశీ ,
రాయపాటి సాంబశివరావు,
కోడెల శివప్రసాద్ – ఈ ఆరుగురు నేతలను బిజెపి తమ పార్టీలోకి చేర్చుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది అన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్, ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న కోడెల శివ ప్రసాద్, గతంలో అవినీతి ఆరోపణలు గట్టిగా ఎదుర్కొన్న రాయపాటి సాంబశివరావు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినపుడు భారీగా అవినీతి చేశాడు అంటూ వైఎస్ఆర్సిపి ఆరోపణలు చేస్తున్న దేవినేని ఉమా లాంటి వారి మీద విచారణ చేయించి అవసరమైతే కేసుల్లో ఇరికించడానికి బిజెపి నిర్ణయించుకుందని, అందుకే వీరిని తీసుకోకూడదు అని బిజెపి భావిస్తోందని ఇప్పటికే కొన్ని ఊహాగానాలు బయలుదేరాయి.
కొద్దిరోజుల కిందట బిజెపి అధికార ప్రతినిధి విజయ్ బాబు సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, బిజెపిలోకి కొంతమంది నేతలని తాము చేర్చుకోబోమని, బిజెపిలోకి చేరాలని వారు ప్రయత్నిస్తున్నా కూడా తమ పార్టీ అధినాయకత్వం ఒప్పుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలకు సరిపోలుతూ ఉండడం గమనార్హం.