ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ… ఈ సారి తన వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సలహాదారు అవతారం ఎత్తారు. టీడీపీ సర్కార్ ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన.. చంద్రబాబుకు ఆయన అనధికారికంగా ముఖ్యసలహాదారుగానే ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ విషయం తెలిసిన వారికి… ఈ వారం ” కొత్తపలుకు” చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే.. చంద్రబాబు ఏమేం తప్పులు చేశారో.. సవివరంగా.. వివరించడమే కాదు.. జగన్మోహన్ రెడ్డి కూడా ఆవే చేస్తున్నారని.. ఆలా చేయకూడదని సలహాలిచ్చేశారు.
చంద్రబాబు అన్ని తప్పులు చేయడానికి కారణం ఎవరు..?
” ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబునాయుడు పార్టీని గాలికి వదిలేశారు. జగన్మోహన్రెడ్డికి కొన్ని బలమైన సామాజికవర్గాల మద్దతు ఉందన్న వాస్తవాన్ని గుర్తించలేదు. చంద్రబాబు మార్క్ పాలన కనిపించలేదు. ఎమ్మెల్యేల విచ్చలవిడితనాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. బలమైన వ్యక్తులు- శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంపై భారీస్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా ఖాతరు చేయలేదు. 1999 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎలా వ్యవహరించారో దాదాపుగా అలాగే వ్యవహరించారు….” ఇలా… చాంతాడంత… చంద్రబాబాబు మైనస్‌ను.. వేమూరి రాధాకృష్ణ తన ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. ఒంటెత్తు పోకడల వల్ల ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారే కరువయ్యారని ఆర్కే విశ్లేషించారు. అంతే కాదు.. అమరావతి కట్టినా.. రోడ్లేసినా… ఇతర ఏ అభివృద్ధి పథకం అయినా కమ్మవారి కోసమే పెడుతున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేసినా తిప్పికొట్టలేకపోయారని.. ఓటమికి కారణాలు ఆర్కే చెబుతున్నారు.
ఇన్ని తెలిస్తే చంద్రబాబుకు అప్పుడెందుకు చెప్పలేదు..?
నిజానికి ఆర్కే చెప్పినవన్నీ నిజాలే. కానీ.. ఇవన్నీ చంద్రబాబు వద్దకు వెళ్లకుండా.. ఆయన జాగ్రత్త పడకుండా.. ముసుగులు కప్పిందెవరు..? సర్వేలు, ప్రజాభిప్రాయాలు పేరుతో.. చంద్రబాబుకు ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా… రిపోర్టులు ఇప్పించి.. ఆయన తన దారిలో తాను వెళ్లిపోయేలా చేసిందెవరు..? . మొత్తంగా చేసింది ఆర్కేనేనని చెప్పలేము కానీ.. కచ్చితంగా.. అలాంటి వారిలో ఆయన కూడా ఒకరని.. టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటాయి. ఇప్పుడు.. కొసమెరుపేమిటంటే…” కొత్తపలుకు”లో.. చంద్రబాబు చేసిన తప్పులే జగన్ చేస్తున్నారని.. అలాంటి తప్పులు చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అనడం వల్లే పదవి వచ్చిందని.. దాన్ని.. అనుచితంగా ఉపయోగించుకుంటే.. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని.. తన ఆర్టికల్ ద్వారా చెప్పకనే చెప్పారు.
జగన్ ఈ పరోక్ష సలహాలను పట్టించుకుంటారా..?
“ఏం జరిగినా మీరు సూపర్” అని కొంతమంది కీర్తించడం, ఆ మాయలో పడిపోవడం వల్లనే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డిని కూడా అలాంటి భజంత్రీలు “అదరగొట్టారు” అని కీర్తిస్తూ ఉండవచ్చు… అలాంటి వారి పొగడ్తలకు అలవాటు పడితే మొదటికే మోసం వస్తుందని.. చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో… ఆర్కే అచ్చంగా… చేసింది ఇదే కదా..!. మొత్తానికి కొత్తపలుకులో ఆర్కే… కొన్ని నిజాలను అంగీకరిస్తున్నారు. టీడీపీ ఓటమిలో తన పాత్రను… కూడా.. ఆయన తన ఆర్టికల్స్ ద్వారా… పరోక్షంగా అయినా చెబుతున్నారని… కొంత మంది అభిప్రాపడేలా.. అబిప్రాయాలు రాస్తున్నారు. టీడీపీ నేతలది కూడా ఇదే అభిప్రాయం. కొద్ది రోజుల కిందట సమావేశమైన కాపు నేతల అజెండాలో… ఆర్కే జోక్యం కూడా చర్చకు వచ్చిందంటే.. ఉన్నట్లే కదా మరి..!