కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అసెంబ్లీ వేదికగా బల నిరూపణలు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొంత మంది రెబల్స్‌తో చర్చలు జరిపి.. బుజ్జగించేందుకు.. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. నలుగురైదుగురు రెబెల్స్‌తో టచ్‌లో ఉన్నామని, ఒకటి రెండు రోజుల్లో వారంతా మళ్లీ పార్టీలోకి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ బెంగళూరులో మకాం వేసి… రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించబోతున్నారు.
ప్రభుత్వం కచ్చితంగా బలపరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. బల పరీక్షలో అసంతృప్త ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు ఖాయం. అందుకే రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదు. విప్ ప్రకారమే వారు ఓటు వేస్తారని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అనర్హతా వేటు వేస్తే.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా… స్పీకర్ ఆదేశిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. 18 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే… కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ సర్కారు బలం 100కు తగ్గిపోతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ కూడా 113 నుంచి 105కు పడిపోతుంది. బీజేపీకి ఇప్పటికే 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా బీజేపీని సమర్థిస్తున్నారు. అలాంటి సందర్భంలో 107 మంది మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదే అనర్హతా వేటు వేసి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తామన్న సంకేతాలు పంపితే.. అందరూ రాజీనామాలపై వెనక్కి తగ్గే అవకాశం ఉంది.
రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంతో ఇరు వర్గాల మధ్య టెన్షన్ కొనసాగుతోంది. తొలుత పది మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో కేసు వేయగా.. ఇప్పుడు మరో ఐదుగురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారందరికీ కూడా అనర్హతా బయమే వెంటాడుతోంది. తమను అనర్హులుగా ప్రకటించకుండా ఆదేశించాలని వారు కోర్టును అభ్యర్థించారు. రెబెల్ ఎమ్మెల్యేలపై మంగళవారం వరకు అనర్హత వేటు వేయకూడదని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.