గత ఏడాది మే, జూన్ నెలల్లో.. తెలంగాణలో పండుగ వాతావరణం ఉంది. తెలంగాణ సర్కార్ ఎకరానికి రూ. నాలుగు వేల చొప్పున.. ఎన్ని ఎకరాలు ఉంటే.. అన్ని ఎకరాలకు… ధనిక రైతు.. పేద రైతు అనే తేడా లేకుండా అందరికీ పంపిణీ చేసింది. అప్పట్లో అందరిలోనూ ఉత్సాహం. ప్రతి ఊరిలోనూ ప్రభుత్వాధికారులు పండుగ చేశారు. చెక్కులు చేతిలో పెట్టారు. రైతులు కూడా.. ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఆరు నెలలకు ఎన్నికల సమయానికి చెక్కులు రెడీ చేశారు కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది.. అయితే.. బ్యాంకుల్లో జమ చేశారు. ఎన్నికలు అయిపోయాయి.. మళ్లీ మే, జూన్ కూడా అయిపోయింది. కానీ అప్పటి పండుగ ఏది…?
రైతు బంధు కోసం.. జూన్ ప్రారంభంలో.. రూ. 6,900 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఆ మేరకు ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ఇంత వరకూ.. సగం మంది రైతులకు కూడా.. నగదు పంపిణీ కాలేదు. తెలంగాణలో దాదాపుగా… 58 లక్షల మంది భూములున్న రైతుల్ని అధికారికంగా గుర్తించారు. వీరిలో.. కనీసం ఇరవై లక్షల మందికి ఇంత వరకూ.. ఎలాంటి సాయం అందలేదు. బ్యాంకుల్లో జమ చేస్తామని.. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇవి అసలు సమస్యలే కాదని సులువుగా అర్థం చేసుకోవచ్చు.. ఎందుకంటే.. పథకం ప్రారంభించినప్పుడు.. ఆతర్వాత విడత కూడా.. ఎలాంటి సమస్యలు లేకుండా… నగదు పంపిణీ చేశారు. ఇప్పుడు ఇంకా స్మూత్‌గా కార్యక్రమం జరిగిపోతుంది. కానీ… నిధుల లభ్యత లేకపోవడం వల్లే..ఈ సమస్య వచ్చిందని భావిస్తున్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెట్టుబడి పథకం…ఎకరానికి రూ. ఐదు వేలు చేశారు. ఈ కారణంగా… ఎన్ని ఎకరాలు ఉంటే.. అన్ని రూ. ఐదు వేలు పంపిణీ చేయాల్సి వస్తోంది. కేంద్రం కానీ.. ఇతర రాష్ట్రాల్లో కానీ… కొంత మొత్తం పరిమితి పెట్టుకున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి రైతుకు రూ. 12,500 ఇస్తామని ప్రకటించారు. దాంతో ఆయనకు భారం పరిమితంగానే ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం.. ఎకరాల లెక్క తీసుకోవడంతో… భారం పెరిగిపోయింది. పైగా.. ధనిక రైతులకు సైతం… పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. తెలంగాణ సర్కార్‌కు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రభావం పథకాలపై కనబడుతోంది.