హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(మజ్లిస్) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్‌లో ఉపఎన్నిక జరుగనున్న బీకాపూర్ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించారు. ఆయనకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ, దళిత, ముస్లిమ్ సామాజికవర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కూల్చటానికి తాను పని ప్రారంభించానని అన్నారు. అంబేద్కర్, రోహిత్ వేముల, దాద్రి ఘటనలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్వాతంత్ర్యం తర్వాత 50,000 మంది ప్రజలు తమ ఇళ్ళను వదిలి వెళ్ళటం ముజఫర్ నగర్లో మాత్రమే జరిగాయని అన్నారు. అయితే మాయావతినిగానీ, బీఎస్పీని గానీ అసద్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.
ఐసిస్‌ను తాముకూడా ఖండిస్తున్నామని చెప్పారు. ఐసిస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని అన్నారు. ఐసిస్‌పై పోరుకు మన సైన్యాన్ని పంపే ఆలోచనను ప్రధాని మోడి విరమించుకోవాలని, అది మన యుద్ధం కాదని చెప్పారు. 2017లో జరిగే యూపీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. మరోవైపు మొన్న పాతబస్తీలో ఉత్తమ్, షబ్బీర్‌లపై జరిగిన దాడికి సంబంధించి అసద్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అసద్ యూపీనుంచి రాగానే ఆయనను పోలీసులు ఇంటరాగేట్ చేసే అవకాశముంది.