పోకిరి సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ ట్విస్టు మరో ఎత్తు. అప్పటి వరకూ ఓ రకంగా సాగిన సినిమా, ఆ ట్విస్టుతో పతాక స్థాయికి చేరుకుంది. అయితే ఈ ట్విస్టు వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. దాన్ని పూరి గుర్తు చేసుకున్నాడు. పోకిరి కథ చెబుతున్నప్పుడు ఈ ట్విస్టు రాగానే – మహేష్ కి ఈ సినిమా రేంజు అర్థమైపోయిందట. ఈ ట్విస్టు నచ్చే మహేష్ ఈ కథని ఓకే చేశాడట. అయితే మణిశర్మ మాత్రం సగం కథ విని `ఈ కథ బాగోలేదు. ఆడదు` అని పెదవి విరిచాడట. అయితే క్లైమాక్స్ ట్విస్టు చెప్పగానే… కథపై మణికి గురి కుదిరిందట. మహేష్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న స్టిల్ బయటకు వస్తే మహేష్ పోలీస్ అనే సంగతి ముందే తెలిసిపోతుందని, ఆ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు కనీసం స్టిల్ ఫొటోగ్రాఫర్‌ని కూడా సెట్‌లోకి రానివ్వలేదట పూరి.
‘కృష్ణ మనోహర్ ఐపీఎస్.. బ్యాచ్ నెంబర్ 32567..’ అంటూ నాజర్ డైలాగ్ చెబుతారు. బ్యాచ్ నెంబర్లతో రాస్తే కొంచెం భారీగా ఉంటుందనిపించింది. కానీ ఐపీఎస్‌లకు బ్యాచ్ నెంబర్లుంటాయని కూడా నాకు తెలీదు. ‘షూటింగ్ సమయంలో చూద్దాంలే అనుకుని 32567 అంటూ నా ఫోన్ నెంబర్‌లోని చివరి అంకెలు రాశా. హడావుడిలో అలానే షూటింగ్ చేసేశాం. నా స్నేహితుల్లో ఐపీఎస్‌లు ఉన్నారు. ‘ఈ బ్యాచ్ నెంబరేంట్రా’ అని వాళ్లలో ఒక్కరూ అడగలేదు. సల్మాన్ ఖాన్‌తో ‘పోకిరి’ రీమేక్ చేయాలనుకున్నాం. ఆయన అందులో రెండు సీన్లు చూసి ‘సినిమా బాగుంది. నేను చేస్తా’ అన్నారు. ఓరోజు షూటింగ్ సెట్‌కి పోలీస్ యూనిఫామ్ తీసుకెళ్తే… ‘అది ఎందుకు’ అని సల్మాన్ అడిగారట. ‘ఇందులో మీరు పోలీస్ కదా’ అని చెప్పేంత వరకూ ఆ విషయం సల్మాన్‌కి తెలీదు’’ అంటూ పోకిరి ట్విస్టు వెనుక ఉన్న స్టోరీ చెప్పుకొచ్చాడు పూరి.