అదేంటీ.. అప్పుడే అంతమాట అనేశారు! ఎంత కాదనుకున్నా రహస్య స్నేహితులే కదా అని అందరూ అనుకుంటే… ఠాట్, అదేం లేదు, వారు కేంద్రంతో దోస్తైతే మాకేం, మేం రాష్ట్రంలో ప్రతిపక్షమే అనే యాటిట్యూడ్ కి ఏపీ భాజపా నేతలు ఠక్కున ప్లేటు ఫిరాయించినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టేశారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మరో నాలుగేళ్లలో ఏపీలో తమ పార్టీయే ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచారానికి మాత్రమే కనిపిస్తున్నాయనీ, కిందిస్థాయిలో సామాన్య ప్రజలకు అవి చేరడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల గురించి జగన్ ప్రభుత్వం గొప్పగా చెబుతోందనీ, కానీ అమలు తీరుని చూస్తుంటే.. ఆయన చెప్పే మాటలకీ చేతలకీ పొంతన ఉండటం లేదన్నారు!
సంక్షేమ పథకాల గురించి పేపర్ల మీద ఉంటే సరిపోదనీ, క్షేత్రస్థాయిలో కనిపించాలని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తాను సూచించా అన్నారు కన్నా. పార్టీలకు అతీతంగా, నిస్పక్షపాతంగా పాలన ఉంటుందని ఆయన చెప్పారుగానీ, వాస్తవంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. సొంతవారు బయటవారు అనే తేడా ఉంటోందన్నారు. తెలుగుదేశం పాలనతో పోల్చుకుంటే, అంతకంటే ఎక్కువగా అరాచకాలు చేయడానికే ప్రయత్నిస్తున్నారని జగన్ సర్కారు మీద కన్నా తీవ్రమైన ఆరోపణ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి అంటూ వలంటీర్లను పెట్టారనీ, వారంతా వైకాపా వారేననీ, టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఎలాగో ఇవీ అంతేననీ, అంతకుమించి తేడా ఉండదని కన్నా అన్నారు!
ఉన్నట్టుండి ఒకేసారి వైకాపా సర్కారుపై ఏపీ భాజపా నేతలు దాడి ప్రారంభించేశారు. నిజానికి, కేంద్రం నుంచి కొన్ని సూచనాత్మక హెచ్చరికల్లాంటి సంకేతాలు ఈ మధ్య రాష్ట్రానికి వస్తూనే ఉన్నాయనుకోండి! అయినా, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం చాలా ఉంది. కన్నా ఊసెత్తడం లేదు. కన్నా మాటల తీరు గమనిస్తుంటే… అర్జెంట్ గా ప్రతిపక్ష పాత్రను ఏపీలో పోషించేద్దామనే ఆతృత భాజపా వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తామే ప్రయత్నామ్నాయం కాబోతున్నామంటే… దానర్థం ఏంటీ, టీడీపీకి ప్రత్యామ్నాయమనే సౌండే ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి, వీలైనంత త్వరగా జగన్ సర్కారుపై విమర్శల దాడి మొదలుపెట్టాయాలని అనుకున్నట్టున్నారు.