పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగలేనంటూ రాహుల్ గాంధీ రాజీనామా చేసి 50 రోజులు పూర్తయింది. రోజులు గడుస్తున్నాయేగానీ… అధ్యక్ష సంక్షోభం కాంగ్రెస్ పార్టీలో అలానే కొనసాగుతోంది. ఏవో తాత్కాలిక చర్యలే తప్ప… పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఏఐసీసీ ఇంకా దృష్టి పెట్టడం లేదు. రాహుల్ తప్పుకున్నా కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నుకునే అధికారం ఏఐసీసీకి ఉంటుంది. కానీ, ఇంతవరకూ ఆ దిశగా ఒక్క సమావేశమూ పెట్టలేదు. ఈ మధ్య రెండుసార్లే ఏఐసీసీ సమావేశం జరిగింది. కానీ, కొత్త అధ్యక్షుడి ఎన్నిక టాపిక్ ని ఎవ్వరూ తీసుకుని వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ప్రస్తుత కర్ణాటక సంక్షోభంపైనే ఏఐసీసీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. అది ఒక కొలీక్కి వచ్చేస్తే, ఆ తరువాత కొత్త అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ దృష్టిపెడుతుందని అంటున్నారు.
అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఎంత ఆలస్యం చేస్తే… కాంగ్రెస్ పార్టీకి అన్ని సమస్యలు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ రాజీనామా అంటూ హైడ్రామా మొదలైన దగ్గర్నుంచీ చూసుకుంటే… చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సమస్యలు పెరుగుతున్నాయి. దానికి కర్ణాటక పరిస్థితే సరైన ఉదాహరణ. రాజస్థానంలో అధికారంలో ఉంది కదా అనుకుంటే, అక్కడి సీఎం అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు తెరమీదికి వచ్చింది. గోవాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయారు. ఢిల్లీలో పీసీసీ- ఏఐసీసీ ఇన్ ఛార్జుల గొడవ రచ్చకెక్కుతోంది. అక్కడ షీలా దీక్షిత్ పై సొంత పార్టీలో మూతివిరుపులు కనిపిస్తున్నాయి. హర్యానాలో గులాం నబీ ఆజాద్ తీసుకున్న ఓ నిర్ణయం కొత్త చిచ్చుపెట్టింది. అక్కడి పీసీసీ ఛీఫ్.. ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తే, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ హోదా దాన్ని ఆజాద్ రద్దు చేశారు. దాంతో అక్కడ ఆజాద్ తీరుపై అసంతృప్తి వ్యక్తమౌతోంది. ముంబై కాంగ్రెస్ లో ప్రముఖ నేతలు జుత్తులు పట్టుకుంటున్నారు. సిద్ధూ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్ లో అసంతృప్తులు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. అక్కడ అమరీంద్ర సింగ్ వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. మధ్య ప్రదేశ్, గుజరాత్ లలో పీసీసీ అధ్యక్ష పదవులపై ఆశావహుల గొడవ.
జాతీయ నాయకత్వం సక్రమంగా ఉంటే ఇలాంటి వ్యవహారాలకు మొదట్లోనే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. హైకమాండ్ సరిగా లేదు కదా.. అనే ఒకింత నిర్లక్ష్య ధోరణి నేతల్లో పెరిగిందనేది కనిపిస్తోంది. అందుకే, వారంతా స్వతంత్రంగా ఒక స్థాయి దాటి వ్యవహరించే పరిస్థితి వచ్చిందని పార్టీలో సీనియర్లు వాపోతున్నారు. వ్యక్తిగత అజెండాలతో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారనీ, వారికి చెక్ పెట్టాలంటే ఏఐసీసీ జోక్యం చేసుకోవాలనీ, కానీ జాతీయ అధ్యక్షుడు లేకపోవడంతో ఈ పరిస్థితిని ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. చివరికి, ఇవన్నీ రాహుల్ గాంధీ చూస్తున్నా కూడా… నాయకుల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదనీ, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతల్ని మాత్రమే ఆయన కలుస్తున్నారని అంటున్నారు! మొత్తానికి, రాష్ట్రాలవారీగా చూసుకుంటే కాంగ్రెస్ లో లుకలుకలు రోడ్డుకెక్కుతున్న పరిస్థితి. వీటన్నింటికీ కొత్త అధ్యక్షుడి ఎంపికే మందుగా కనిపిస్తున్నా, అది అంత త్వరగా సులువుగా అయ్యేట్టు కనిపించడం లేదు.