స్టార్ రేంజ్ వచ్చేశాక… హీరోలంతా ఒకేలా ఆలోచిస్తుంటారు. ప్రతీ సినిమా విషయంలో బీభత్సమైన కేర్ తీసుకుంటుంటారు. ఏ సినిమా పట్టు తప్పినా – తమ స్టార్ డమ్‌కి డామేజ్ తప్పదన్నది వాళ్ల భయం. కథ, కథనం, షూటింగ్.. ఇలా ప్రతీ విషయంలోనూ వాళ్ల ప్రమేయం ఉంటుంది. ఆఖరికి టీజర్ ని కట్ చేయాలన్నా.. ఇన్వాల్వ్మెంట్ తప్పదు. మహేష్ బాబుని తీసుకోండి. ప్రతీ విషయంలోనూ… తన ఆలోచనలు తోడవుతాయి. తనకంటే ఈమధ్య నమ్రతనే ఎక్కువ జోక్యం చేసుకుంటుంటుంది. ఇదేం తప్పు కాదు. ఓ స్టార్ హీరో సినిమా అంటే… కోట్లలో బిజినెస్ జరుగుతుంటుంది. లక్షలాది అభిమానులు ఇష్టంతో ఎదురుచూస్తుంటారు. కనీసం అభిమానులకైనా సమాధానం చెప్పాలి, వాళ్లకైనా ప్రయత్నం నచ్చాలన్న ఆశ. దీన్ని ఓవర్ ఇన్వాల్మెంట్ అంటూ దర్శక నిర్మాతలు తెగ బాధ పడిపోయినా – సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో ఇన్పుట్స్ చాలా ఉపయోగపడతాయి.
అయితే ప్రభాస్ వైఖరి పూర్తిగా భిన్నం. ఓ రకంగా చూస్తే… కాస్త మెతక. ఏ విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం ఉండదు. ఇప్పుడు అదే…. తనకు పూర్తి మైనస్‌గా మారిందా? అనిపిస్తోంది. `సాహో..`విషయంలో ఇప్పటి వరకూ అన్నీ హడావుడిగానే జరుగుతూ వచ్చాయి. చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. బడ్జెట్ పెరుగుతూ పోయింది. సంగీత దర్శకులు మారిపోయారు. విడుదల తేదీ వాయిదా పడింది. వీటన్నింటికీ కారణం.. ఈ సినిమాని ప్రభాస్ పెద్దగా పట్టించుకోకపోవడమే అని తేలుతోంది. దర్శకుడు సుజిత్ తనకు మంచి ఫ్రెండ్. ఇక యూవీ క్రియేషన్ అంటే తన సొంత నిర్మాణ సంస్థే. అందుకే అన్ని విషయాల్నీ దర్శక నిర్మాతలకు వదిలేశాడు. ఫస్ట్ లుక్ ఎప్పుడు? టీజర్ ఎప్పుడు? రిలీజ్ డేట్ పక్కాగా ఉందా, లేదా? అంటూ అందరు హీరోల్లా దర్శక నిర్మాతల్ని పరుగులు పెట్టించకుండా కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇది నిజంగా దర్శక నిర్మాతలకు ఓ వరమే. కానీ.. వాళ్లు మరింత నిదానంగా సాహోని తీర్చిదిద్దడం మొదలెట్టారు. అందుకే ఇప్పుడు విడుదలకు ముందు ఇన్ని అవాంతరాలు ఎదుర్కుంటోంది. సాహోని 15న కాకుండా 30న విడుదల చేస్తామన్నా.. ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దర్శక నిర్మాతలపై ప్రభాస్ అతిగా ఆధారపడిపోతున్నాడని, అది సాహోపై నెగిటీవ్ ఇంపాక్ట్ తీసుకొస్తోందని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ వైపు నుంచి కూడా ఒత్తిడి వచ్చేస్తే.. ఇంత పెద్ద ప్రాజెక్టుని హ్యాండిల్ చేయడంలో దర్శక నిర్మాతలు మరింత ఇబ్బంది పడతారని, అందుకే ప్రభాస్ కాస్త చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేతైనేం.. సాహో లేట్ అవుతోంది. లేట్ అయినా మంచి అవుట్ పుట్ ఇస్తే అటు ప్రభాస్‌తో పాటు ఇటు ప్రభాస్ అభిమానులు కూడా హ్యాపీనే. కనీసం రిజల్ట్‌తో అయినా ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తే అంతకంటే కావాల్సిందేముంది?